పోలవరం విషయంలో కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీపై ఎదురు దాడికి బీజేపీ సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించారు బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై నమ్మకంతో ప్రాజెక్టు అప్పగిస్తే ఇంత పని చేస్తారా అని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరించాల్సింది పోయి.. కేంద్రంపై విమర్శలు చేస్తారా అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. కేంద్రం వద్ద టీడీపీ అసలు విషయాలను దాచి పెట్టి.. కేవలం సాంకేతికపరమైన అంశాలతో లేఖను రాయడం తగదని అన్నారు.
టీడీపీ దురుద్దేశం మాకు తెలుసు
గుత్తేదారులను మార్చాలన్న ఆలోచన వెనుక దురుద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. అయితే ప్రాజెక్టు నిర్మాణం సమయంలోనే నిర్వాసితుల సమస్య కూడా వచ్చి భారం పెరుగుతోందన్న విషయం తమకు తెలుసునని వెల్లడించారు. ఈ విషయంలో కేంద్రం వద్దకు వెళ్లి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే మిత్రపక్షమని తాము సంయమనం పాటిస్తుంటే .. ఇలా విమర్శలు చేయడం సరికాదని సోము వీర్రాజు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి.. సంబంధిత మంత్రిత్వశాఖకు చేరవేస్తూనే ఉన్నామన్నారు. పోలవరం టెండర్ల విషయంలో కేంద్రం రాసిన లేఖపై చంద్రబాబు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. కాగా తాజా పరిణామాలతో రాజకీయవాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ పరిణామాలు ఎంతవరకు వెళ్తాయన్న దానిపై ఉత్కంఠత నెలకొంది
చంద్రబాబుపై బీజేపీ కౌంటర్ ఎటాక్