హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, మాజీ మంత్రి, టీడీపి అగ్రనేత డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు ఇక లేరు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆయన్ను కుటుంబసభ్యులు హుటాహుటిన బసవతారకం ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆయన చనిపోయినట్టుగా అక్కడి వైద్యులు ధృవీకరించినట్టు తెలుస్తోంది. ఆరుసారు ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల.. స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కేబినెట్లో పలు శాఖలకు మంత్రిగా సేవలందించారు. 1983 నుంచి 2004 వరకు ఐదుసార్లు గుంటూరు జిల్లా నరసారావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల శివ ప్రసాద్ రావు.. 2014 ఎన్నికల్లో అదే జిల్లాలోని సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1947లో మే 2న గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంట గ్రామంలో కోడెల శివప్రసాద్ రావు జన్మించారు. చిన్నతనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడాన్ని తట్టుకోలేకపోయిన కోడెల శివప్రసాద్ రావు.. ఆ కసితోనే ఎంబిబిఎస్ చదువుకున్నారు. అనంతరం వారణాసిలో ఎంఎస్ పూర్తి చేసి నరసారావుపేటలో ఆసుపత్రి ప్రారంభించారు. అక్కడ డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్న సమయంలోనే అప్పట్లో టీడీపిని ప్రారంభించిన ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. అనతి కాలంలోనే టీడీపిలో తిరుగులేని నేతగా ఎదిగారు.
డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పల్నాటి పులిగా పేరు తెచ్చుకున్న ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని నేతలు ఆవేదన వ్యక్తంచేశారు.