Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ మరో పదిరోజుల్లో వెలువడనుంది. తెలుగుదేశం 95 సీట్లలో జనసేన 5 సీట్లలో అభ్యర్ధుల్ని ప్రకటించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎక్కడ్నించి పోటీ చేస్తారో స్పష్టత ఉంది. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం విషయంలోనే ఇంకా అస్పష్టత నెలకొంది. పార్టీ అధినేతగా ఎక్కడ్నించి పోటీ చేస్తారో నిర్ణయించుకోలేకపోవడం కార్యకర్తల్లో అయోమయానికి గురి చేస్తోంది.
జనసేన పార్టీ స్థాపించి పదేళ్లయినా ఇంకా గ్రామ లేదా మండల లేదా నియోజకవర్గ స్థాయిలో పార్టీ పటిష్టం కాలేదు. ఆ విషయాన్ని స్వయంగా జనసేనాని పవన్ కళ్యాణే అంగీకరించిన పరిస్థితి. అయితే తెలుగుదేశం-జనసేన పార్టీలు ఇటీవల విడుదల చేసిన ఉమ్మడి జాబితాలో చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు వంటి నేతలు ఎక్కడ్నించి పోటీ చేస్తారో తేలింది గానీ జనసేనాని మాత్రం తానెక్కడ్నించి పోటీ అనేది చెప్పలేకపోయారు. పొత్తులో భాగంగా 24 స్థానాలు తీసుకున్నా ఐదే స్థానాలకు అభ్యర్ధుల్ని ప్రకటించారు. ఆ ఐదింటిలో కూడా తానెక్కడ్నించనేది చెప్పలేదు. ఇదే ఇప్పుడు కార్తకర్తల్లో అయోమయానికి గురి చేస్తోంది.
2019లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల్నించి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండింట్లో ఓడిపోయారు. దాంతో ఈసారి సురక్షితమైన స్థానం కోసం సర్వేలపై సర్వేలు చేయిచుకుంటున్నారు. చాలా రకాలుగా పరిశీలన చేస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగుపెట్టాలనుకుంటున్నారు. తొలుత భీమవరం నుంచి పోటీ అని భావించినా ఆ తరువాత వెనకడుగు వేశారు. మరో నాలుగు స్థానాల్లో సర్వే చేయించారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలో కాపు సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉండటంతో అక్కడ్నించి పోటీ చేద్దామని అనుకున్నారు. కానీ వైసీపీ అక్కడ స్థానికంగా పట్టు కలిగిన అదే సామాజికవర్గానికి చెందిన వంగా గీతను నిలబెట్టడంతో పవన్ కళ్యాణ్ ఆలోచన మారినట్టు తెలుస్తోంది. అంటే పిఠాపురం నుంచి కూడా పోటీ చేసే పరిస్థితి లేకపోవచ్చు. గాజువాక ఎలా ఉంటుందనే ఆలోచన కూడా కలిగినా విరమించుకున్నారని సమాచారం. చివరిలో ఇప్పుడు తాడేపల్లిగూడెం స్థానంపై కన్నేశారు. సామాజికవర్గం అదికంగా ఉండటంతో పాటు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు.
పిఠాపురం, భీమవరం, గాజువాక కంటే తాడేపల్లిగూడెం సురక్షితమనే అభిప్రాయానికి వచ్చి ఇప్పుడు ఆ నియోజకవర్గంలో సర్వే చేయిస్తున్నారు. ఈ స్థానాన్ని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఆశిస్తున్నారు. తాడేపల్లి గూడెం నుంచి వైసీపీ అభ్యర్ధిగా మంత్రి కొట్టు సత్యనారాయణ బరిలో ఉండవచ్చు. తెలుగుదేశం-టీడీపీ ఉమ్మడి జెండా సభ కూడా తాడేపల్లిగూడెంలో జరగడం వెనుక కారణం కూడా ఇదే కావచ్చంటున్నారు. అన్నింటికంటే ఇదే సేఫ్ అనే ఆలోచనలో ఉన్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎక్కడ్నించి పోటీ చేస్తారనేది కూడా సందిగ్దంగానే మారింది. తొలుత అనకాపల్లి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అది కూడా పెండింగులో పడింది. మరో స్థానం కోసం ఆలోచిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి పార్టీ అధినేత ఎక్కడ్నించి పోటీ చేస్తారనేది స్పష్టత లేకపోవడం, ఏ స్థానం సురక్షితమో నిర్ణయించుకోలేకపోవడంపై పార్టీలో అయోమయం నెలకొంది.
Also read: AP Common Capital: ఏపీ హైకోర్టుకు చేరిన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook