'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. వైరస్ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 37 లక్షల 80 వేల 620 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 2 లక్షల 61 వేల 700 మంది కరోనా వైరస్ మహమ్మారికి బలైపోయారు.
లాక్ డౌన్ ఎత్తేసే ఆలోచనలో..
ఇటలీ, స్పెయిన్, అమెరికా
వైరస్ మళ్లీ పడగవిప్పుతుందని..
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక..!!
కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు అన్ని దేశాలు లాక్ డౌన్ విధించాయి. దాదాపు 2 నెలల నుంచి లాక్ డౌన్ కొనసాగుతోంది. కానీ ఆర్ధిక వ్యవస్థ కుదేలవడం, ప్రజలకు ఇబ్బంది కలగుతోందన్న కారణంగా ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ క్రమక్రమంగా ఎత్తేసేందుకు అన్ని దేశాలు వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు కరోనా వైరస్ ఇప్పటికీ లొంగి రాలేదు. ప్రపంచ దేశాల్లో వైరస్ మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO... అన్ని ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది.
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ ను ఎత్తేయడంలో ప్రపంచ దేశాలు తొందరపడవద్దని WHO తెలిపింది. అలా చేస్తే.. కరోనా వైరస్ మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అత్యవసరం అయితేనే లాక్ డౌన్ ఎత్తేయాలని.. అంతే కాకుండా అవసరమైన పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరింది. జెనీవా నుంచి వీడియో ద్వారా WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ గెబ్రేసస్ మాట్లాడారు. లాక్ డౌన్ ఎత్తేయాలనుకునే ప్రపంచ దేశాలు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వైరస్ మహమ్మారి విస్తృతిని నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలని కోరారు. అలాగే ప్రజలకు క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. లేనిపక్షంలో లాక్ డౌన్ ఎత్తేయగానే వైరస్ మళ్లీ పడగ విప్పే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
WHO ఎపిడెమిలాజిస్ట్ మరియా వాన్ కెర్కెవ్ కూడా టెడ్రోస్ ను సమర్థించారు. లాక్ డౌన్ ఇంత త్వరగా ఎత్తేస్తే మళ్లీ ముప్పు తప్పదని హెచ్చరించారు. ఇటలీ, స్పెయిన్, అమెరికా లాక్ డౌన్ ఎత్తేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఐతే లాక్ డౌన్ విషయంలో ఆయా ప్రభుత్వాలదే తుది నిర్ణయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కానీ లాక్ డౌన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని మాత్రమే తాము సూచిస్తామని పేర్కొంది.
ప్రజా రవాణా వ్యవస్థ పునరుద్ధరిస్తాం..!!
మరోవైపు త్వరలోనే భారత దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. లాక్ డౌన్ కారణంగా మార్చి 24 నుంచి ఇప్పటి వరకు ప్రజారవాణా వ్యవస్థ నిలిచిపోయిందని.. దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందని చెప్పారు. ఐతే ప్రజా రవాణా వ్యవస్థను పునఃప్రారంభించేందు కోసం మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత బస్సులు, రైళ్లు, విమానాలు కొంత మేర తిప్పుతామని చెప్పారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..