ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆప్ఘనిస్తాన్‌లో తీవ్రవాదులకు హెలీకాఫ్టర్లను సరఫరా చేస్తూ, వారికి మద్దతిస్తూ, ఏమీ తెలియని నంగనాచిలా అమెరికా ప్రవర్తిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిషేదిక తీవ్రవాద సంస్థ ఇసిస్‌తో అమెరికా ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయని, అయినా ఏమీ తెలియనట్లు నటించడం అమెరికా ఎత్తుగడ అని ఆయన అభిప్రాయపడ్డారు. 9/11 దాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పై వారికి తెలియని వ్యతిరేకత ఏర్పడిందని, అందుకోసం బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతూ, మా నేలను ఛిన్నాభిన్నం చేయడం ఎంత వరకు శ్రేయస్కరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో కారణం చేత మాబ్ (మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్) అనే బాంబును తమపై అమెరికా ప్రయోగించలేదని, అది ఉత్తర కొరియా కోసమని అమెరికాయే చెబుతోందని, ఒక వినాశకారిగా అమెరికా తయారవుతుందని ఆయన చెప్పారు. అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్‌లో అడుగుపెట్టాక అక్కడి పర్యావరణానికి తీరని నష్టం సంభవించిందని ఆయన తెలిపారు. ఈ విషయాలన్నీ లండన్‌లో రష్యన్ టుడే పత్రికతో ఆయన పంచుకున్నారు.