ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాద ముఠా చేతికి చిక్కి అయిదు సంవత్సరాలు నరకయాతనను అనుభవించిన అమెరికన్ కెనడియన్ దంపతులు ఎట్టకేలకు విడుదయ్యారు. 2012లో ఒక టూర్ నిమిత్తం ఆఫ్ఘనిస్తాన్ పరిసరాల్లో సంచరించిన జాషువా బోయల్ దంపతులను తాలిబన్‌కు చెందిన హక్కానీ నెట్వర్క్ అనే ఉగ్రవాద సంస్థ కిడ్నాప్ చేసింది. దాదాపు 5 సంవత్సరాలు వారి పర్యవేక్షణలోనే ఉన్న వీరు ఎట్టకేలకు పాకిస్తాన్ చొరవతో విడుదల చేయబడ్డారు. ఈ సందర్భంగా జాషువా బోయల్ మాట్లాడుతూ అనుకోకుండా దొరికిన తమ కుటుంబాన్ని ఉగ్రవాదులు చిత్రహింసలకు గురి చేశారని, గర్భిణీగా ఉన్న తన భార్యపై అత్యాచారం చేసి, మూడు నెలల పసిగుడ్డును కూడా చంపేశారని వాపోయారు. అయితే ఇటీవలే వీరిని ఉగ్రవాదులు బోర్డర్ నుండి తరలిస్తున్నప్పుడు తమకు అందిన సమాచారం మేరకు పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్లు వాహన టైర్లను పేల్చివేసి, కిడ్నాపర్లను హతమార్చి, దంపతులను రక్షించారు. తొలుత ఈ దంపతులను అమెరికా తరలించాలని భావించినా, బోయల్ కోరిక మేరకు కెనడాకు పంపించారు. అక్కడి టొరంటో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విలేఖరులతో మాట్లాడిన బోయల్, తమ ఇద్దరు పిల్లలతో పాకిస్తాన్ ఆర్మీకి దొరికినప్పడు పరిస్థితి చాలా దారుణంగా ఉందని, కనీసం తిండి కూడా తినలేనంత బలహీనంగా తమ పిల్లలు తయారయ్యారని చెప్పారు.
తన తల్లిదండ్రులను కలవడానికి బోయల్ తన కుటుంబంతో సహా కెనడాలోని ఒట్టావా ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అయితే ఇంకా భద్రతా పరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉందని ప్రభుత్వం ప్రకటించింది.కెనడా ప్రభుత్వం కూడా ఈ కేసులో వచ్చిన పురోగతిని చెబుతూ, ఇక ఈ కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత తమ ప్రభుత్వం మీద ఉందని అధికారికంగా స్టేట్మెంట్ అందించింది. బోయల్ గతంలో అమెరికాలో నివసిస్తున్న తన స్నేహితుని సోదరిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెతో విడాకులు తీసుకున్నాక, అమెరికన్ అమ్మాయైన కెయిట్లాన్ కోల్మన్ను పెళ్లాడారు. ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి, తమ కార్యక్రమాల్లో భాగంగా ఈ దంపతులు వివిధ దేశాలు సంచరిస్తూ, 2012లో ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్‌కి సుదూరంగా ఉన్న ప్రాంతంలో ఉగ్రవాదులకు పట్టుబడ్డారు.