కథువా ఘటనపై ఐరాస అధినేత ఆవేదన

భారతదేశంలో తీవ్ర సంచలనం నమోదు చేసిన కథువా అత్యాచార ఘటనపై ఐక్యరాజసమితి చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ ఎంతో ఆవేదనను వ్యక్తం చేశారు.

Last Updated : Apr 14, 2018, 06:24 PM IST
కథువా ఘటనపై ఐరాస అధినేత ఆవేదన

భారతదేశంలో తీవ్ర సంచలనం నమోదు చేసిన కథువా అత్యాచార ఘటనపై ఐక్యరాజసమితి చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ ఎంతో ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఎంతో భయంకరమైన సంఘటనగా ఆయన ప్రస్తావించారు. భారత ప్రభుత్వం బాధితులకు న్యాయం చేకూరుస్తుందనే తాను ఆశిస్తున్నానని తెలిపారు.

జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో ఓ 8 ఏళ్ళ బాలికకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి.. ఆ పై హత్య చేసిన వైనాన్ని ఆయన అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. బాలిక పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించిన ఆ నరరూప రాక్షసులను శిక్షించాలని ఆయన డైలీ ప్రెస్ పత్రికకు తెలియజేశారు. ఈ సంఘటన గురించి తాము కూడా పలు మీడియా రిపోర్ట్సు‌లో చదివామని.. ఈ ఘటనకు కారకులైనవారిని భారత ప్రభుత్వం శిక్షిస్తుందని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు

జనవరి 10వ తేదిన జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో ముస్లిం సంచార తెగలకు చెందిన ఓ బాలిక తప్పిపోగా.. ఆమె గురించి పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత ఆ బాలిక శవం జనవరి 17వ తేదిన అడవిలో లభించింది. ఆ చిన్నారిని కొందరు వ్యక్తులు స్థానిక ఆలయంలోకి తీసుకువెళ్లి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలింది. 

క్రైం బ్రాంచి ఈ కేసు టేకప్ చేశాక.. ఈ ఘోరమైన చర్యకు కారణమైన ఎనిమిది మందిని అరెస్టు చేశారు. అలా అరెస్టు కాబడిన వారిలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ఈ ఘోరమైన సంఘటనపై నిన్నే భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇలాంటి సంఘటనలు తనను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేస్తుంటాయని.. బాధితులకు తగిన విధంగా న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు

Trending News