పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల రూపాయలను మోసగించి ఇండియా నుంచి పారిపోయి విదేశాల్లో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యింది. ఇంటర్ పోల్ అధికారులు నీరవ్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల జారీతో విదేశాల్లో ఉన్న నీరవ్ మోదీని ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నీరవ్ మోదీ అరెస్ట్ అయితే, అతన్ని అప్పగించమని భారత్ కోరవచ్చు. అందుకు భారత్ ఆయా దేశాలతో ఉన్న ఒప్పందాలు, సంబంధాలు సహకరిస్తాయి. నీరవ్‌తో పాటు అతని సోదరుడు నిశాల్, సుభాష్ పరబ్‌లకు వ్యతిరేకంగా కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీఅయ్యాయి.
నీరవ్ మోదీకి వ్యతిరేకంగా జారీ చేసిన రెడ్‌కార్నర్ నోటీసులను ఇంటర్ పోల్ తన వెబ్‌సైట్‌లో పెట్టింది. నీరవ్‌కు వ్యతిరేకంగా జారీ అయిన నోటీసుల్లో అతని ఫోటోగ్రాఫ్, వ్యక్తిగత వివరాలు, పుట్టిన తేదీ, అతనికి వ్యతిరేకంగా మనీ లాండరింగ్ ఛార్జస్ నమోదైనట్టు ఉన్నాయి.
Red Corner Notice issued against Nirav Modi by Interpol in connection with #PNBScamCase pic.twitter.com/pOeE09SCUy
— ANI (@ANI) July 2, 2018
నీరవ్ మోదీ, అతని సన్నిహితులు కలిసి పీఎన్‌బీలో దాదాపు రూ.13 వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. నగదును మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించి..మోదీ, అతని సన్నిహితులు కేసు వెలుగులోకి రాకముందే దేశం విడిచి పారిపోయారు. ఇప్పటికీ నీరవ్ ఎక్కడ ఉన్నాడన్నది స్పష్టంగా తెలియలేదు. విచారణ చేపట్టిన దర్యాప్తు ఏజెన్సీలు ఈ-మెయిల్ ద్వారా సంప్రదించినప్పటికీ అతని నుంచి స్పందన రాలేదు.