అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ఇజ్రాయెల్ పాలకులు ఆ దేశంలోని వెస్టర్న్ వాల్ ప్రాంతంలో కట్టే రైల్వేస్టేషన్‌కి ఆయన పేరు పెట్టాలని నిశ్చయించుకున్నారట. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా అమెరికా పరిగణనలోకి తీసుకోవడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఇజ్రాయెల్ రవాణాశాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ వెల్లడించారు. అయితే ఈ రైల్వేస్టేషన్ కట్టబోయే వెస్టర్న్ వాల్ ప్రాంతం జెరూసలేంకు చాలా దగ్గరగా ఉండడం గమనార్హం.
కాగా ఇజ్రాయెల్ పాలకుల నిర్ణయంపై పాలస్తీనా ప్రభుత్వం మండిపడింది. జెరూసలేం అంశంపై ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న క్రమంలో, ఇజ్రాయెల్ పాలకులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం హింసను ప్రేరేపించడమేనని, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.