బీజింగ్: చైనాలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రాణాంతక కరోనా వైరస్ (COVID-19)ను ఎదుర్కొనేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్న వుహాన్‌లోని వుచాంగ్ ఆస్పత్రి డైరెక్టర్ లియు ఝిమింగ్ మంగళవారం ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజుల కింద కరోనా వైరస్‌ను తొలిసారి గుర్తించిన కంటివైద్యుడు వుహాన్ హాస్పిటల్లోనే చనిపోయిన విషాదాన్ని మరవకముందే డైరెక్టర్ మరణవార్త వినాల్సి వచ్చింది. ప్రాణాంతక కోవిడ్-19 వైరస్ కారణంగా ఫిబ్రవరి 17 నాటికి చైనాలో మరణించిన వారి సంఖ్య 1,868కి చేరుకుందని సమాచారం.
Also Read: వైరస్‌ను కనుగొన్న డాక్టర్నే బలిగొన్న కరోనా
సోమవారం ఒక్కరోజే 100 మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా అధికారికంగానే 72000 మంది కోవిడ్-19 బారినపడ్డారని రిపోర్టులు చెబుతున్నాయి. ఇటీవల కరోనాను గుర్తించిన డాక్టర్ కన్నుమూయగా, తాజాగా వుహాన్ లోని ఓ ఆసుపత్రి డాక్టర్ సైతం ఆ మహమ్మారికి బలికావడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రాణాంతక వైరస్ కోవిడ్ 19ను గుర్తించేందుకు క్లోజ్ కాంటాక్ట్ డిక్టేటర్ (#CloseContactDetectorAPP) అనే యాప్‌ను సైతం చైనా రూపొందించిన విషయం తెలిసిందే. మరణాల పెరుగుదల రేటు తగ్గుముఖం పడుతున్నా, కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం విచారకరం.
Also Read: కరోనా వైరస్‌ను గుర్తించే యాప్ వచ్చేసింది
Liu Zhiming, director of Wuhan Wuchang Hospital, passed away at 10:30 a.m. on Tuesday due to novel coronavirus pneumonia. pic.twitter.com/BJN7UaDJiN
— China Economy (@CE_ChinaEconomy) February 18, 2020
ఇతర దేశాల్లో కరోనా మరణాలు మొదలుకాగా, అంతర్జాతీయంగా మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తుతున్నాయి. డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ అనే ఓడలో ప్రయాణిస్తున్న వారిలో 454 మందికి కోవిడ్ 19 వైరస్ సోకిందని జపాన్ ఆరోగ్య శాఖ స్వయంగా వెల్లడించింది. కరోనా కారణంగా చైనాలో ఉత్పత్తులు భారీగా తగ్గిపోయి, మార్కెట్ పరంగానే స్థానికంగా, ఇతర దేశాల్లో వస్తువులకు భారీ కొరత ఏర్పడింది. చైనాకు ప్రయాణాలు రద్దవుతున్న కారణంగా సింగపూర్, అమెరికా, మరికొన్ని దేశాలు ఎయిర్ లైన్స్ సేవల్ని తాత్కాలికంగా రద్దు చేశాయి.