పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్న ఆధారాల ప్రకారం టర్కీలోని ఒక పాతబడిన చర్చి సముదాయంలో క్రిస్మస్ తాతగా మరియు శాంతా క్లాజ్‌గా పిలవబడే సెయింట్ నికోలస్ సమాధి లభ్యమైనట్లు వార్తలు వస్తున్నాయి. టర్కీలోని దక్షిణ అంటల్యా ప్రాంతంలోని డెమ్రె జిల్లాలో ఈ చర్చి ఉంది. ఇదే ప్రాంతాన్ని శాంతాక్లాజ్ జన్మ స్థలంగా చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఇదే విషయానికి సంబంధించి ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. దాదాపు 1674 సంవత్సరాల సమాధిని నిజంగానే బయటపెట్టడం సాధ్యమా.. అన్న అనుమానాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. క్రీ.శ 343 సంవత్సరంలో ఇదే చర్చిలో నికోలస్ భౌతికకాయం ఖననం చేయబడిందని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఇటలీ నుండి వస్తున్న కొన్ని వార్తల ప్రకారం, క్రూసేడ్స్ యుద్ధాలు జరుగుతున్న సమయంలో వెనిస్ ప్రాంతానికి నికోలస్ అస్తికలను పంపించినట్లు కథనాలు ఉన్నాయి. అయితే అలా తీసుకువెళ్లినవి నికోలస్ అస్తికలు కాదని టర్కీష్ చరిత్రకారులు తేల్చి చెబుతున్నారు. దాదాపు ఎనిమిది శాస్త్ర విభాగాలకు చెందిన పరిశోధకులు ఇప్పుడు ఈ సమాధి రహస్యం చేధించేందుకు టర్కీలో ఉన్నారు.