ఆ అమ్మాయి పేరు నౌరా హుస్సేన్. ఆమెకు ప్రస్తుతం 19 సంవత్సరాలు. కానీ 15 సంవత్సరాలకే ఆమెకు పెళ్లి చేసేశారు తల్లిదండ్రులు. సుడాన్ లాంటి దేశంలో పేదరికం వల్ల చాలా చిన్న వయసులోనే పిల్లలకు పెళ్లి చేసేయడం అన్నది ఎన్నాళ్లగానో వస్తున్న సాధారణ ఆనవాయితీ. అయితే ఆ వయసులో కాపురానికి పంపించడానికి సిద్ధమైన తల్లిదండ్రులను ఎదిరించింది ఆ బాలిక.
అంతే కాదు... ఇంట్లోంచి పారిపోయి చాలా దూర ప్రదేశంలో ఉన్న తన బంధువుల ఇంట్లో తల దాచుకుంది. అక్కడే మూడు సంవత్సరాలు గడిపింది. కానీ ఇటీవలే ఆమె ఆనవాళ్లు పసిగట్టిన ఆమె తల్లిదండ్రులు నౌరాను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి ఆమె భర్త కుటుంబానికి అప్పగించారు.
నౌరా భర్త ఆమెను ప్రతీ రోజూ లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తన బంధువులు, స్నేహితుల సహాయంతో ఆమె కాళ్లు, చేతులు కట్టించి బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ సంఘటన జరిగిన ఒక రోజు గడవకముందే గాయాలతో బాధపడుతున్న.. ఆమెపై మళ్లీ అత్యాచారానికి తెగబడ్డాడు. కానీ ఈసారి నౌరా లొంగలేదు.
తనను తాను రక్షించుకోవడానికి గట్టిగానే పోరాడింది. అందులో భాగంగానే మంచం పక్కనున్న చాకును తీసి తన భర్తను పొడిచేసింది. నౌరా భర్త అక్కడిక్కడే చనిపోయాడు. ఆ తర్వాత నౌరాను పోలీసులు అరెస్టు చేశారు. సుడాన్ చట్టాల ప్రకారం 10 సంవత్సరాలు నిండిన బాలిక పెళ్లికి అర్హురాలే. అలాగే భార్యపై భర్త అత్యాచారం చేసినా అది చట్టానికి ఆమోదమే. అందుకే అక్కడి చట్ట ప్రకారం తనను అత్యాచారం చేసిన భర్తను హతమార్చిన భార్యకు మరణశిక్షను విధించాలని ఆదేశించింది కోర్టు.
అయితే నౌరా హుస్సేన్ కేసు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. ఆమె దేశంతో పాటు మిగతా ఆఫ్రికా దేశాలలోని మహిళా సంఘాలు కూడా ఈ తీర్పుపై విరుచుకుపడ్డాయి. సుడాన్ లోని చట్టాలు మార్చాల్సిందేనని.. నౌరాకి న్యాయం జరగాల్సిందేనని పోరాటం చేస్తున్నాయి.
అయితే అంతర్జాతీయంగా నౌరాకి న్యాయం జరగాలని పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తే తప్పించి ఈ కేసులో బాధితురాలికి శిక్ష పడే అవకాశం మాత్రం నూటికి నూరుపాళ్లు ఉంటుందని అంటున్నారు ఆ దేశంలోని మేధావులు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇప్పటికే ఈ కేసు విషయమై ప్రపంచ దేశాలలోని ప్రముఖ న్యాయపరిశోధకులను సంప్రదిస్తోంది. నౌరాకి న్యాయం జరగాలని కోరుకుంటోంది.
The death penalty is the ultimate cruel, inhumane and degrading punishment, and to impose it on a teenage survivor of rape is a gross human rights violation. We are urging the Sudanese authorities to #SaveNoura Hussein → https://t.co/lcoqiJtOgf pic.twitter.com/4GDDKVNnMI
— Amnesty Int'l NI (@AmnestyNI) May 12, 2018