VRA Suicide Attempt: మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో గురువారం ప్రభుత్వం చేపట్టిన విఆర్ఏ నియామకాల పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామానికి చెందిన షేక్ సలీం అనే వృద్ధుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న వృద్ధుడిని అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకుని బయటికి లాక్కెళ్లారు. దీంతో నియామకాల పత్రాల పంపిణీ కార్యక్రమం కాస్తా రసాభాసగా మారి ఆందోళనలకు వేదికగా తయారైంది.
తమ తాతలు, తండ్రుల కాలం నుండి ఇదే ఉద్యోగాన్ని చేసుకుంటూ బతుకీడుస్తున్నామని.. కొత్తగా తమని కాదని తన తండ్రి హుస్సేన్ ఉద్యోగాన్ని అధికారులు అర్హత లేని మరో వ్యక్తికి అమ్ముకున్నారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం, ఇటీవల సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం .. తాతల కాలం నుంచి పనిచేస్తోన్న తమకే ఆ ఉద్యోగం రావాలని.. కానీ నెల్లికుదురు మండలం డిప్యూటీ తహశీల్దార్ తరంగిణి తమ గ్రామానికే చెందిన యాకుబ్ పాషా అనే మరో వ్యక్తి వద్ద డబ్బులు తీసుకుని తమకు రావాల్సిన ఉద్యోగాన్ని అతడికి కేటయించారని షేక్ సలీం అనే ఆ వృద్ధుడి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.
ఇదే విషయమై ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశామని.. తమ సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆర్డీఓకు సూచించారని.. అక్కడికి వెళ్తే ఈ ఉద్యోగాన్ని యాకుబ్ పాషా అనే మరో వ్యక్తికి ఇచ్చామని చెబుతున్నారని బాధితుడి కుటుంబసభ్యులు వాపోయారు. ఏదైనా ఉంటే కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించాలని ఆర్డీఓ చెప్పారని.. కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఆర్డీఓ దగ్గరకు వెళ్లమని.. ఆర్డీఓ దగ్గరకు వెళ్తే కలెక్టర్ దగ్గరకు వెళ్లమని తిప్పుకుంటున్నారే కానీ ఎవ్వరూ తమ సమస్యని పరిష్కరించడం లేదంటూ షేక్ సలీం కుటుంబం ఆవేదన వ్యక్తంచేసింది. వారసత్వంగా తనకే రావాల్సిన ఉద్యోగం కనుక తన ఉద్యోగం తనకి ఇప్పించాలని షేక్ సలీం కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ తహశీల్ధార్ తరంగిణి అవతలి వ్యక్తి వద్ద లంచం తీసుకుని తమకు అన్యాయం చేస్తోంది అని షేక్ సలీం కుటుంబసభ్యులు ఆరోపించారు.
తాత ముత్తాతల కాలం నుంచి గ్రామాల్లో సహాయకులుగా పనిచేస్తున్న వీఆర్ఏలకు పే స్కేలు అమలు పరిచి, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ తాను ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జూలై 24న సచివాలయంలో అందుకు సంబంధించిన జీ.వో కాపీని వీఆర్ఏ జేఏసీ నేతలకు అందజేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, " రైతుల కల్లాల కాడ ఇచ్చింది తీసుకుంటూ.. గ్రామ సేవ చేసిన నాటి భూస్వామ్య కాలపు అవశేషమైన వీఆర్ఏ వృత్తి విధానాన్ని రద్దు చేసుకొన్నామన్నారు. వారికి పే స్కేలు కల్పించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేశాం " అని సీఎం అన్నారు.
ఇది కూడా చదవండి : Good news to VRAs: వీఆర్ఏలకు గుడ్ న్యూస్.. ఇకపై శాఖసింధి వ్యవస్థ రద్ధు
ఇదిలావుంటే, తన ఉద్యోగాన్ని మరొకరికి అమ్మేసుకున్నారని.. తన ఉద్యోగం తనకి కావాలని డిమాండ్ చేస్తూ వేదిక ముందే షేక్ సలీం ఆత్మహత్యాయత్నం చేసినప్పటికీ.. నియామకాల పత్రాల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, మహబూబాబాద్ జిల్లా అధికార యంత్రాంగం మాత్రం అటువైపు కూడా కన్నెత్తి చూడలేదు. యధావిధిగా తమ కార్యక్రమంలో తాము నిమగ్నమై నియామకాల పత్రాల పంపిణి ప్రక్రియను కొనసాగించడం కొసమెరుపు. జిల్లా కేంద్రంలో అధికారుల ముందు జరిగిన ఘటన పరిస్థితి ఇలా ఉంటే ఇక మారుమూల ప్రాంతాల పరిస్థితి ఏంటని ఆ కార్యక్రమానికి వచ్చిన వారు చెవులు కొరుక్కోవడం వినిపించింది.
ఇది కూడా చదవండి : Baby Boy And Baby Girl Exchanged: మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చిన్న పిల్లల తారుమారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి