వీఆర్వో కాలర్ పట్టుకొని బయటికీడ్చుకొచ్చిన మహిళా రైతు

వీఆర్వో కాలర్ పట్టుకొని బయటికీడ్చుకొచ్చిన మహిళా రైతు

Last Updated : Aug 31, 2019, 09:24 AM IST
వీఆర్వో కాలర్ పట్టుకొని బయటికీడ్చుకొచ్చిన మహిళా రైతు

వీఆర్వోలు తల్చుకుంటే ఒక రైతుకి చెందిన భూమిని మరొక రైతు పేరు మీద రాసేస్తున్నారని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. పాత చట్టాలను ఆధారంగా చేసుకుని కొంత మంది రైవిన్యూ అధికారులు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని.. ఆ పాత చట్టాలకు పాతరేసి వాటి స్థానంలో పకడ్బందీగా కొత్త చట్టాలను తీసుకొస్తామని అసెంబ్లీలో ప్రకటించే క్రమంలో సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్వోలపై అసహనానికి గురైనట్టుగానే.. తాజాగా సంగా రెడ్డి జిల్లా వట్‌పల్లి మండల తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఓ మహిళా రైతు కూడా ఓ వీఆర్వోపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. 
    
ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మేడుకుంద గ్రామానికి చెందిన మహిళా రైతు పోచమ్మ తమ గ్రామ వీఆర్వోను కలిసేందుకు గురువారం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తన పేరిట ఉన్న భూమిని తన ప్రమేయం లేకుండానే తన కొడుకుల పేరిట పట్టా రాశారనేది పోచమ్మ ఆరోపణ. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకే తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన పోచమ్మకు అక్కడ వీఆర్వోను చూడగానే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ''నువ్వు అడిగినన్ని డబ్బులు ఇచ్చినప్పటికీ.. నీ చుట్టూ తిప్పించుకుంటున్నావు కానీ పని మాత్రం చేయడం ఎందుకు చేయడం లేదు'' అంటూ వీఆర్వోను కాలర్ పట్టుకొని మరి బయటికీడ్చుకొచ్చారామె.  

ఊహించని పరిణామానికి ఖంగుతిన్న సదరు వీఆర్వో.. తన కాలర్ పట్టుకున్న పోచమ్మను దూరంగా నెట్టేసి అక్కడి నుంచి పలాయనం చిత్తగించారని తెలుస్తోంది. వీఆర్వో నెట్టేయడంతో కిందపడి స్పృహ కోల్పోయిన పోచమ్మను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. గ్రామాల్లో రెవిన్యూ అధికారులపై రైతులకు ఉన్న అసంతృప్తి, ఆగ్రహావేశాలకు ఈ ఘటన ఓ సాక్ష్యంగా నిలిచింది.

Trending News