TARGET KCR : సీబీఐ కేసులు.. ఈడీ దాడులు.. ఐటీ సోదాలు.. ఎన్ఐఎ తనిఖీలు.. ఈ మాటలు కొన్ని రోజులుగా తెలంగాణలో కామన్ గా మారిపోయాయి. రోజు తెలంగాణ రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు లేనట్లుగా సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ స్పెషల్ టీమ్ లు తెలంగాణలో మకాం వేశాయి. తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థ దాడులు, సోదాలకు సంబంధించి మరో కీలక అంశం కూడా ఉంది. సోదాలు జరుగుతున్న వ్యక్తులు, సంస్థలన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ చుట్టే తిరుగుతున్నాయి. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ రావు సన్నిహితులు, వ్యాపార సంబంధాలున్న వ్యక్తులు, కంపెనీలే కేంద్ర దర్యాప్తు సంస్థల టార్గెట్ లో ఉండటం కలకలం రేపుతోంది. కేంద్ర సంస్థల దూకుడుతో సీఎం కేసీఆర్ కుటుంబం టార్గెట్ గానే ఈ దాడులు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వచ్చాయి. ఆమె కేంద్రంగానే డీల్స్ జరిగాయని ఢిల్లీ బీజేపీ ఎంపీ ఆరోపించారు. లిక్కర్ స్కాంతో తనకు సంబంధం లేదని కవతి ప్రకటించినా.. ఈకేసులో సీబీఐ, ఈడీ విచారణ మొత్తం ఆమె చుట్టూనే సాగుతున్నట్లు కనిపిస్తోంది. లిక్కర్ స్కాంకు సంబంధించి హైదరాబాద్ లో పలు సార్లు ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ కేసులో ఏ14గా ఉన్న రామచంద్రన్ పిళ్లైతో పాటు సూదిని సృజన్, బోయినపల్లి అభిషేక్, గండ్ర మోహన్ రావు ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఇందులో అభిషేక్ కవితకు అత్యంత సన్నిహితుడు. సృజన్ కు కవితతో వ్యాపార బంధం ఉందని తెలుస్తోంది. మద్యం వ్యాపారి రామచంద్రన్.. కవిత కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఫోటోలు బయటికి వచ్చాయి. గండ్ర మోహన రావుకు కూడా కవితతో బిజినెస్ డీల్స్ ఉన్నాయంటున్నారు. దీంతో కవిత టార్గెట్ గానే లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ విచారణ ముందుకు పోతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఆగస్టు 23న హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ కంపెనీ ఫీనిక్స్ కార్యాలయంపై ఐటీ అధికారులు దాడులు చేశారు. కంపెనీకి చెందిన 10 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు జరిగాయి. మాదాపూర్ లోని ఐటీ సెజ్ లోనూ తనిఖీలు జరిగాయి.
ఫినిక్స్ సంస్థలు పలు వెంచర్స్, రియల్ ఎస్టేట్ ఇన్ ఫ్రాలో పెట్టుబడులు పెట్టింది. ఫినిక్స్ సంస్థ చైర్మెన్ చుక్కపల్లి సురేష్ కు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఉన్నాయనే టాక్ ఉంది.ఫీనిక్స్ చైర్మెన్ చుక్కపల్లి సురేష్ కు కేటీఆర్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఫీనిక్స్ సంస్థలో కేటీఆర్ భారీగా పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఫీనిక్స్ కు ప్రయోజనం కలిగేలా రూల్స్ కు విరుద్ధంగా కేసీఆర్ సర్కార్ పలు నిర్ణయాలు తీసుకుందని గతంలో విపక్షాలు ఆరోపించాయి. దీంతో కేటీఆర్ టార్గెట్ గానే జరుగుతున్నాయనే ఐటీ దాడులు జరిగాయని భావిస్తున్నారు. కేటీఆర్ తో మంచి సంబంధాలున్న మరికొన్ని ఐటీ, రియల్ ఎస్టేట్ కార్యాలయాల్లోనూ ఐటీ, జీఎస్టీ అధికారులు సోదాలు చేశారని తెలుస్తోంది.
ఇక ఆదివారం జరిగిన ఎన్ఐఏ దాడులు తీవ్ర కలకలం రేపాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో ఎన్‌ఐఏ బృందాలు తెలంగాణాలోని 38 ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో చోట సోదాలు నిర్వహించాయి. ఎన్ఐఏతో పాటు జీఎస్టీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. పీఎఫ్‌ఐ కార్యకలాపాల ముసుగులో ఉగ్రవాదశిక్షణ ఇస్తూ దేశవ్యాప్తంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేసింది ఎన్ఐఏ. నిజామాబాద్‌లోనే 23 చోట్ల, జగిత్యాలలో 7, హైదరాబాద్‌లో 4, నిర్మల్‌లో 2, ఆదిలాబాద్, కరీంనగర్‌లలో తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో 8.31లక్షల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ ప్రకటించింది. అయితే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల లింకులు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కేటీఆర్, కవితకు సన్నిహితంగా ఉండే సదరు ఎమ్మెల్యేలకు విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయంటున్నారు. ఇందుకు సంబంధించి ఆధారాల కోసమే ఎన్ఐఏ, జీఎస్టీ అధికారులు సోదాలు చేశారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
హైదారాబాద్ లో జరుగుతున్న ఈడీ, సీబీఐ సోదాలు ఎమ్మెల్సీ కవిత టార్గెట్ గా సాగుతుందనే ప్రచారం సాగుతోంది. ఐటీ, జీఎస్టీ దాడులు మాత్రం కేటీఆర్ కేంద్రంగానే జరుగుతున్నాయని అంటున్నారు. కొంత కాలంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ సాగుతోంది. జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్.. కేంద్ర సర్కార్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ ముక్త భారత్ నినాదంతో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు వెళ్లి వివిధ పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. మోడీ సర్కార్ విధానాలను ఎండగడుతున్నారు. దీంతో కమలనాధులు కూడా కారు పార్టీ అధినేతను టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటిస్తూ కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో తమకు కొరకరాని కొయ్యగా మారుతున్న కేసీఆర్ ను బీజేపీ టార్గెట్ చేసిందని అంటున్నారు. అందులో భాగంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణలో మకాం వేశాయని అంటున్నారు. ఇంతలోనే డిల్లీ లిక్కర్ స్కాంలో కవిత లింకులు బయటపడటంతో బీజేపీకి అస్త్రం దొరికినట్లైంది. ఇక కేటీఆర్ కు సన్నిహితంగా ఉండే పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేస్తోందని టాక్ వస్తోంది. కేంద్ర సంస్థల దాడులతో కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే వ్యాపార వర్గాలకు హెచ్చరిక పంపడమే బీజేపీ వ్యూహంగా కనిపిస్తుందని అంటున్నారు.
Also read: Khammam: లిఫ్ట్ పేరుతో ఇంజెక్షన్ దాడి..ఖమ్మం జిల్లాలో దారుణం..!
Also read: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో గంటకో ట్విస్ట్.. తమకు సంబంధం లేదన్న అధికార పార్టీ ఎంపీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok
TARGET KCR : ఇటు కేసీఆర్ ఫ్యామిలీ... అటు సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏ, జీఎస్టీ! తెలంగాణలో ఏం జరుగుతోంది..?
తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు
కేసీఆర్ కుటుంబమే టార్గెట్టా?
కొన్ని రోజులుగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ