Kcr Target Jr Ntr: హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ బ్రహ్మస్త్ర సినిమా ప్రి రిలీజ్ వేడుక రద్దు కావడం రాజకీయ రచ్చగా మారింది. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మస్త్ర సినిమా ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు. వినాయక చవిత బందోబస్తులో బిజీగా ఉన్నామంటూ ప్రి రిలీజ్ వేడుకకు అనుమతి ఇవ్వకపోవడంతో షో రద్దైంది. బందోబోస్తు పేరుతో పోలీసులు అనుమతి రద్దు చేశారని చెబుతున్నా.. దీని వెనుక రాజకీయ హస్తం ఉందనే చర్చ సాగుతోంది. బ్రహ్మాస్త్ర వేడుకకు టాలీవుడ్ టాప్ హీరో , పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరుకావాల్సి ఉంది. దీంతో జూనియర్ టార్గెట్ గానే తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం సాగుతోంది. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలిశారు. ఇదే తాజా పరిణామాలకు కారణమైందని అంటున్నారు.
తెలంగాణలో గత ఎనిమిది ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. టాలీవుడ్ తో కేసీఆర్ సర్కార్ ఫ్రెండ్లీగానే వ్యవహరిస్తోంది. సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాల్లో సానుకూల నిర్ణయాలే తీసుకుంటుంది. టాలీవుడ్ పెద్దలకు సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోల విషయంలో ఏపీ ప్రభుత్వంతో ఇబ్బంది వచ్చినా... తెలంగాణలో మాత్రం ఎలాంటి సమస్యలు రాలేదు. సినీ వర్గాలు చెప్పిన విధంగానే కేసీఆర్ సర్కార్ చేసుకుంటూ పోయిందనే వాదన ఉంది. అలాంటిది బ్రహ్మస్మ్త ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చివరి నిమిషంలో అనుమతులు రద్దు చేయడం సంచలనమైంది. సినీ వర్గాలను కలవరానికి గురి చేసింది. రాజకీయ కారణాలతోనే ఇలా జరిగిందనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. కొన్ని రోజులుగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఓ రేంజ్ లో వార్ సాగుతోంది. ఈ ప్రభావమే బ్రహ్మస్త్రపై పడిందంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పై కేసీఆర్ సర్కార్ పొలిటికల్ బ్రహ్మాస్త్రం విసిరిందనే టాక్ నడుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ గానే తెలంగాణ సర్కార్ అనుమతి రద్దు నిర్ణయం తీసుకుంటే.. కేసీఆర్ కు తారక్ ఎందుకు టార్గెట్ అయ్యారు అన్నదానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.
శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలిసిన సందర్భంగా ఇద్దరి మధ్య దాదాపు 40 నిమిషాల పాటు ఏకాంత చర్చలు జరిగాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ నటన బాగుందని ప్రశంసించడానికే అమిత్ షా పిలిపించారని బీజేపీ వర్గాలు చెప్పినా... రాజకీయ చర్చలే జరిగాయని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కోసం ప్రచారం చేయాలని జూనియర్ ను అమిత్ షో కోరారని.. అందుకు తారక్ అంగీకరించారని కేసీఆర్ సర్కార్‌కు ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చాయని సమాచారం. తారక్ బీజేపీకి దాదాపుగా దగ్గరయ్యారని భావించిన కేసీఆర్ సర్కార్... ఇలా టార్గెట్ చేసిందని అంటున్నారు. ఈ ఘటన ద్వారా టాలీవుడ్ కు హెచ్చరిక పంపించాలనే ప్రయత్నం టీఆర్ఎస్ చేసిందనే చర్చ సాగుతోంది. బీజేపీ వైపు వెళితే రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొవాల్సి ఉంటుందనే మెసేజ్ ఇవ్వడానికే తెలంగాణ సర్కార్ చివరి నిమిషంలో ఇలా షాక్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ అనుకూల వ్యక్తులంతా తమకు వ్యతిరేకులుగానే టీఆర్ఎస్ భావిస్తోందని ఈ ఘటనతో తేలిపోతోందని చెబుతున్నారు
మరోవైపు తెలంగాణ సర్కార్ నిర్ణయంతో బీజేపీకి జూనియర్ ఎన్టీఆర్ మరింత దగ్గరయ్యే పరిస్థితులు వచ్చాయనే వాదన కొన్ని వర్గాల నుంచి వస్తోంది. తాను చీఫ్ గెస్ట్ గా వెళ్లాల్సిన ఈవెంట్ కు చివరి నిమిషంలో అనుమతి రద్దు చేయడంపై జూనియర్ హార్ట్ అయ్యారని అంటున్నారు. పార్క్ హయత్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలంగాణ ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేక కామెంట్లు చేయకున్నా.. తాను ఫీల్ అయ్యాననే భావన అతని నుంచి వచ్చిందని అంటున్నారు. బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలనుకున్న తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు జూనియర్. వినాయక విగ్రహ నిమజ్జనం కారణంగా పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయలేమని పోలీసులు చెప్పారని, వారు ఉండేది మన భద్రత కోసమే కాబట్టి వారు చెప్పింది వినడం మన ధర్మమని అన్నారు.పైకి అలా చెబుతున్నా తెలంగాణ సర్కార్ తీరుపై గుర్రుగా ఉన్నారని.. ఆయన బీజేపీకి మరింత దగ్గర కావచ్చని ఆయన సన్నిహితులు అంటున్నారు.
Also Read : Brahmastra Pre-Release Event: బ్రహ్మస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ వెనుక కేసీఆర్ సర్కారు ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి