హైదరాబాద్: తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు మరో రెండు వారాల వ్యవధే మిగిలిఉండటంతో అధికార యంత్రాంగం అందుకు సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలైంది. తాజాగా ఈ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా సికింద్రాబాద్‌లో బుధవారం నిర్వహించిన బూత్ లెవల్ అధికారుల సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్.. కొత్త ఓటర్లకు ఉచితంగా గుర్తింపు కార్డులతోపాటు, ఇంటింటికీ పోల్ చిట్టీలు పంపిణీ చేయాలని బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా దానకిషోర్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలోని 3,800 మంది బీఎల్ఓలు ఈ నెల 26 నుంచి ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాల్సిందిగా స్పష్టంచేశారు.
ఈ నెల 25వ తేదీ నుంచి సూపర్వైజర్లు తమ పరిధిలోని పోలింగ్ బూత్‌లలో బూత్ లెవల్ ఏజెంట్లతో ప్రత్యేకంగా సమావేశమై ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ వివరాలను అందించాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి పోలింగ్ స్లిప్పులను పంపిణీ చేసే క్రమంలో ఎవరైనా మరణించిన, ఇల్లు మార్చిన, రెండుసార్లు పేర్లు నమోదు చేసుకున్న ఓటర్లను గుర్తించాలని ఆదేశించారు.