విధుల్లో చేరతామని ప్రకటించిన కార్మికులు.. స్పందించిన ఆర్టీసీ ఎండి

మంగళవారం నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జేఏసి చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని ఆర్టీసీ ఎండి సునీల్ శర్మ అభిప్రాయపడ్డారు. ఓ వైపు తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటిస్తూనే, మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని చెబుతున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు.

Last Updated : Nov 25, 2019, 09:20 PM IST
విధుల్లో చేరతామని ప్రకటించిన కార్మికులు.. స్పందించిన ఆర్టీసీ ఎండి

హైదరాబాద్: మంగళవారం నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జేఏసి చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని ఆర్టీసీ ఎండి సునీల్ శర్మ అభిప్రాయపడ్డారు. ఓ వైపు తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటిస్తూనే, మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని చెబుతున్నారని కార్మికుల నిర్ణయాన్ని తప్పుపట్టిన ఆయన.. తమ ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరై, ఇష్టమొచ్చినప్పుడు మళ్లీ విధుల్లో చేరడం దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలోనూ ఉండదన్నారు. ఆర్టీసీ కార్మికులు తమంతట తామే విధులకు గైర్హాజరై, చట్ట విరుద్ధమైన సమ్మెలో పాల్గొన్నారు తప్ప, ఆర్టీసీ యాజమాన్యం గానీ, ప్రభుత్వం కానీ వారిని సమ్మె చేయమని చెప్పలేదన్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి అతి ముఖ్యమైన పండుగల సీజన్‌లో అనాలోచిత సమ్మెకు దిగి ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారని అసహనం వ్యక్తంచేసిన సునీల్ శర్మ... కార్మికులు ప్రస్తుతం చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారని స్పష్టంచేశారు. రేపటి నుంచే విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసి ప్రకటించిన నేపథ్యంలో ఈ వివాదంపై స్పందిస్తూ ఆయన తాజాగా ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన ఆర్టీసీ ఎండి సునిల్ శర్మ.. ''ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరయ్యి, మళ్లీ ఇష్టమొచ్చినప్పుడు విధుల్లో చేరడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదని... హైకోర్టు చెప్పిన దాని ప్రకారమే ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై కార్మిక శాఖ కమిషనర్ తగిన నిర్ణయం తీసుకుంటారు'' అని తేల్చిచెప్పారు. కార్మిక శాఖ తీర్పు ప్రకారమే ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు తీసుకుంటుందని వివరించారు. అంతా చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం జరుగుతుందని... అప్పటి వరకు అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుందని సునిల్ శర్మ సూచించారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Trending News