ఇవాళ రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా 'ప్రగతి నివేదన సభ'ను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తికాగా.. ఈ బహిరంగ సభకు 25లక్షల మంది కార్యకర్తలు హాజరుకానున్నారని తెలిసింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ట్రాక్టర్లలో సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. వేదికపై సీఎం కె.చంద్రశేఖర్ రావు, డిప్యూటీ సీఎం, మంత్రులతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, పార్టీ రాష్ట్ర కమిటీ నేతలు, మాజీ మంత్రులు కూర్చోనున్నారు.
బహిరంగ సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నారు. ఆదాయ పరిమితి పెంపు, ఆసరా పథకాలు, విద్యుత్ ఉద్యోగులకు తాజాగా పీఆర్సీ పెంపు, ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, ఉద్యోగ నియామకాలు, ఇతర అంశాలను ప్రస్తావించనున్నారు.
నేడు జరగబోయే ప్రగతి నివేదన సభలో కేసీఆర్.. భారీ నజరానాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.60వేల కోట్ల విలువైన పథకాలను బహిరంగ సభలో వెల్లడిస్తారని సమాచారం. రైతులకు ఇప్పటివరకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తుండగా.. దానిని రూ.2 లక్షల వరకు పెంచనున్నారని, నిరుద్యోగులకు రూ.2000 నుంచి రూ.2500 వరకు నిరుదోగ్య భృతి ఇవ్వనున్నారని, సామాజిక పెన్షన్లను రూ.1500 నుంచి రూ.2వేల వరకు పెంచనున్నారని సమాచారం.
సుమారు 20 వేల మంది పోలీసులతో భారీభద్రత కల్పించారు. ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో కేబినెట్ సమావేశం జరుగుతుంది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హెలికాప్టర్‌లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు.
శనివారం.. విద్యుత్ ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 35 శాతం పీఆర్సీ(వేతన సవరణ) ప్రకటించారు.
భారీ నజరానాలు ప్రకటించనున్న కేసీఆర్!