హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సోమవారంతో తెరపడినట్లయింది. చివరగా ఈనెల 25న పోలింగ్ జరిగిన కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 60 డివిజన్లలో ఇప్పటి వరకూ 34 డివిజన్లలో విజయం సాధించి టీఆర్ఎస్ సత్తా చాటింది. బీజేపీ 12, ఎంఐఎం 5, ఇతరులు 8 డివిజన్లలో గెలుపొందగా.. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఖాతా కూడా తెరవలేదు. దీంతో కరీంనగర్ పీఠాన్ని కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి జెండా రేరెపలాడింది.
మరోవైపు తెలంగాణలోని పలు చోట్ల మున్సిపల్ చైర్మెన్ల ఎన్నిక ఉద్రిక్తంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలక కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీపిఎం పార్టీ సభ్యులు తమకు మద్దతు ప్రకటిస్తామని టీఆర్ఎస్ కు అనుకూలంగా మారడంతో కాంగ్రెస్ నాయకులు అందోళనలు చేశారు. దీంతో చైర్మన్ ఎన్నిక రణరంగంగా మారింది. ఈ క్రమంలో సీపిఎం సభ్యులతో మనుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎంఎల్ఎ రాజగోపాల్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..