తెలంగాణ జన సమితి నేత కోదండరామ్, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య టికెట్ల కోసం బాగానే కొట్టుకున్నారని టీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ ఏ స్థాయిలోనూ పోటీ ఇవ్వలేదని.. కేవలం ప్రతిపక్ష హోదా కోసం మాత్రమే ఆ పార్టీ తాపత్రయ పడుతుందని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. ముందు మహాకూటమి ద్వారా పోటీ పడుతున్న ఇతర పార్టీల నేతలు టికెట్లు ఎలా పంచుకోవాలన్న విషయంలో కూడా తగిన సామర్థ్యం పెంచుకోవాలని.. చిత్రమేంటంటే ఆ సామర్థ్యం వారికి లేదని.. అలాంటి వారు రాష్ట్రాన్ని మాత్రం ఎలా పాలించగలరని హరీష్ రావు ఎద్దేవా చేశారు.
శనివారం నర్సాపూర్‌లో జరిగిన సభలో హరీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ రద్దుచేసి 70 రోజులవుతున్నా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కబెడుతున్న మహాకూటమి అధికారంలోకి వస్తే.. రాజకీయ సంక్షోభం తప్ప రాష్ట్రానికి ఇక ఏమీ మిగలదని హరీష్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్న సునితా లక్ష్మారెడ్డి కనీసం తన ప్రాంతంలో బస్ డిపో కూడా పెట్టించలేకపోయారని.. అలాంటి వారు టీఆర్ఎస్ గురించి మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు.
ప్రస్తుతం నర్సాపూర్ నుండి టీఆర్ఎస్ తరఫున చిలుముల మదన్‌రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఆయన తరఫున ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు ప్రచారం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నర్సాపూర్ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటానని చెప్పడం విడ్డూరంగా ఉందని కూడా హరీష్ అన్నారు. నర్సాపూర్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 25 కోట్లు ఖర్చు పెట్టిందని హరీష్ తెలిపారు. టీఆర్ఎస్, మహాకూటమి మధ్య జరుగుతున్న పోరు ఒకరకంగా చెప్పాలంటే అవినీతికి, అవకాశవాదానికి మధ్య జరుగుతున్న పోరని ఆయన తెలిపారు.