ప్రధాని అభ్యర్ధిగా కేసీఆర్..ఊపందుకున్న ప్రచారం !!

                                                             

Last Updated : Apr 3, 2019, 01:08 PM IST
ప్రధాని అభ్యర్ధిగా కేసీఆర్..ఊపందుకున్న ప్రచారం !!

లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్  ప్రచార పర్వంలో దూసుకెళ్తోంది. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో  హైదారాబాద్ స్థానం మినహాయించి మిగిలిన 16 స్థానాల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ప్రచారం కొనసాగిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా  కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి ప్రస్తావిస్తున్న టీఆర్ఎస్ ..ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కాబోయే పీఎం కేసీఆర్ అంటూ ప్రచారాన్ని మొదలెట్టింది. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించినోళ్లం..16 మందితో పీఎం ఎందుకు కాలేరు అంటూ ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు.
 

పీఎం కేసీఆర్ అంటూ టీఆర్ఎస్ ప్రచారం
టీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి..ఫెడలర్ ఫ్రంట్ అంశాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ పీఎం కావాలనే ఆకాంక్షను బయటపెట్టారు. వరంగల్‌లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మట్లాడుతూ  ఎన్నికల తర్వాత వివిధ ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాడుతుందని.. కేసీఆర్ దేశ ప్రధానమంత్రి కావాలనేది అందరి ఆకాంక్ష అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు. ఎన్నికల తర్వాత ఎన్డీఏ, యూపీఏ కూటములకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇదే సమయంలో కేసీఆర్‌ లాంటి సమర్థుడైన నాయకుడు దేశానికి అవసరమని కడియం పేర్కొనడం గమనార్హం 

 

అసద్ నోట..ఇదే మాట
కేసీఆర్ పీఎం అభ్యర్ధి అనే ప్రచారం ముందు మజ్లీస్ పార్టీ నుంచే మొదలైంది. ఇటీవలె ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ..కేసీఆర్ దేశ ప్రధాని కావాలనే ఆకాంక్షను బయటపెట్టారు. ప్రధానిగా నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ కంటే కేసీఆర్ బెటర్ అని అసదుద్దీన్ అభిప్రాయపడ్డారు.ఈ నేపథ్యంలో ప్రధాని అభ్యర్ధిగా కేసీఆర్ ఏ మేరకు పోటీ పడతారనే తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే మరి.

Trending News