తెలంగాణ అంతటా రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు; ఉద్యోగాలపై కీలక ప్రకటన

త్యాగాల నేల తెలంగాణ రాష్ట్ర అవతరణ ఇవాళ.

Last Updated : Jun 2, 2018, 12:56 PM IST
తెలంగాణ అంతటా రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు; ఉద్యోగాలపై కీలక ప్రకటన

త్యాగాల నేల తెలంగాణ రాష్ట్ర అవతరణ ఇవాళ. ఏళ్ల నాటి ఆకాంక్ష నెరవేరి నేటికీ నాలుగేళ్లు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, వేలమంది ప్రాణ త్యాగాల అనంతరం జూన్ 2, 2014న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. నాలుగేళ్లు పూర్తిచేసుకున్న రాష్ట్రం.. మెల్లగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేకతను చాటుతోంది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రాష్ట్రమంతటా ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ఉదయం పదిన్నరకు పరేడ్‌ గ్రౌండ్స్‌లో సీఎం కేసీఆర్‌ జెండా వందనం చేయనున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు జిల్లాల్లో జెండాను ఎగురవేస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా వందనం కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర చరిత్రను చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు.

ఉదయం 10 గంటలకు గన్ పార్క్‌లో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం సీఎం కేసీఆర్.. పోలీస్ అమరవీరుల స్థూపం దగ్గర శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం పదిన్నరకు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పోలీసు వందనం స్వీకరించి.. ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులకు బహుమతులు ఇస్తారు. ఆతరువాత 11 గంటలకు సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రగతిని ప్రజలకు వివరిస్తారు.

25,000 పోస్టులు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్‌లో 25,000 పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లను సిద్ధం చేసింది. నేడు పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే కేసీఆర్, యువతకు ఉద్యోగాలపై కీలక ప్రకటన చేయనున్నారు. వచ్చే ఆరు నెలల్లోపు 50,000 ఉద్యోగాలను సృష్టించి భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు

 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో.. రవీంద్రభారతి, పీపుల్స్ ప్లాజా, లుంబినీ పార్క్ లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పీపుల్స్ ప్లాజాలో మూడురోజుల ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఎల్లుండి సాయంత్రం లుంబిని పార్క్ నుంచి.. పీపుల్స్ ప్లాజా వరకు వెయ్యి మంది కళాకారులతో.. కల్చరల్ కార్నివాల్ నిర్వహించనున్నారు. ఢిల్లీలోనూ మూడు రోజుల పాటు స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు.

Trending News