Speaker Pocharam Srinivas Reddy: తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. నిజామాబాద్ జిల్లా చందూరు మండలం లక్ష్మాపూర్ గ్రామానికి వెళ్లిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని అక్కడి గ్రామస్తులు అడ్డుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి తమ గ్రామ సమస్యలను పట్టించుకోవడం లేదని.. అటువంటప్పుడు గ్రామానికి ఎందుకు వచ్చారంటూ గ్రామస్తులు స్పీకర్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు.
లక్ష్మాపూర్ లో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం వాటర్ ట్యాంక్ భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ క్రమంలోనే లక్ష్మాపూర్ గ్రామస్తులు ఆయనను అడ్డుకున్నారు. వాహనాలకు అడ్డంగా నిలబడి వాగ్వాదానికి దిగారు.
పోలీసులు మధ్యలో జోక్యం చేసుకొని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ గ్రామస్తులు శాంతించలేదు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. లక్ష్మాపూర్ గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం కోసం వచ్చిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ హఠాత్పరిణామానికి ఖంగు తిన్నారు.
అసలు సమస్య ఏంటంటే..
ప్రస్తుతం వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాల్సిన స్థలంలో బస్టాండ్ నిర్మించాలి అనే డిమాండ్ గ్రామస్తుల నుంచి వ్యక్తమవుతోంది. ఇదే విషయమై తమ డిమాండ్ ని వినిపిస్తూ లక్ష్మాపూర్ గ్రామస్తులు స్పీకర్ కాన్వాయ్ ఎదుట నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. గ్రామస్తుల సమస్యలు వినిపించుకోకుండా అభివృద్ధి పేరిట గ్రామస్తులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ఏంటని గ్రామస్తులు నిలదీశారు. వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని నిలిపి వేసి ఇతర ప్రాంతాల్లో నిర్మాణం చేపట్టాలని పాత బస్టాండ్ ప్రాంతంలో కొత్త బస్టాండు లేదా వ్యాపార సముదాయాలు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
ఎన్నికలు సమీపిస్తున్నందునే స్థానిక నేతలు గ్రామస్తుల సమస్యను పక్కదారి పట్టించి బస్టాండ్ నిర్మించాల్సిన స్థలంలో అభివృద్ధి పేరుతో ట్యాంక్ నిర్మాణం చేయాలని చూస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. సమస్యను అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బాన్సువాడ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి సురేందర్ రెడ్డి హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు ఆందోళన విరమించారు. మొత్తానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా వెళ్లిన కార్యక్రమం రసాభాసగా మారడంతో ఆయన కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. శంకుస్థాపన కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నప్పటికీ.. అక్కడ గ్రామస్తుల నుండి ఎదురైన ఆందోళన, చేదు అనుభవంతో ఆయన కొంత అసంతృప్తిగానే వెనుదిరిగారనే టాక్ వినిపించింది. అంతేకాకుండా అసలు సమస్య ఏంటో పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్థానిక నేతలకు సైతం స్పీకర్ సూచించినట్టు తెలుస్తోంది.
Speaker Pocharam Srinivas Reddy: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి చేదు అనుభవం