Telangana Rains Updates: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం నలుమూలలా ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా ఎక్కడిక్కడ ఇరిగేషన్ అధికారులు రిజర్వాయర్ల గేట్లు నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఏయే జిల్లాల్లో వరదల పరిస్థితి ఎలా ఉందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ధర్మపురిలో పెరిగిన గోదావరి నీటి ప్రవాహం
జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నది వరద ఉధృతి పెరిగింది. గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద నీరు నదిలో చేరుతోంది. దీంతో ప్రస్తుతం గోదావరి నీటి ప్రవాహం పెరిగి ప్రజలు ఇబ్బందు లకు గురవుతున్నారు. ఎగువ వైపు ఉన్న సత్యవతి గుండం నుంచి దిగువన ఉన్న రాయపట్నం వైపు వరద ప్రవాహం వేగంగా కొనసాగుతోంది. ధర్మపురి వద్ద ఉసిరిక వాగు ఆనుకుని నీటి ప్రవాహం కొనసాగుతోంది. భక్తులు లోతు ప్రదేశాలకు వెళ్లకుండా స్నానఘట్టాల వద్ద స్నానాలు చేస్తున్నారు.
మొరాయించిన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు గేట్లు
నిర్మల్ జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు 2865 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఈఈ రాథోడ్ విఠల్ ప్రకటించారు. అంతకంటే ముందుగా కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తే సందర్భంలో మొరాయించడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఓవైపు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటం మరోవైపు గేట్లు మొరాయించడం వారిని ఆందోళనకు గురిచేసింది. కానీ చివరకు గేట్లు తెరుచుకోవడంతో అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. గోదావరి నదీ తీరాన గల గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, రైతులను నదీ వైపు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. వరద ప్రాంతాన్ని ధర్మపురి తహసీల్దార్ వెంకటేష్, ఎస్‌ఐ దత్తాత్రి సందర్శించారు.
భయం గుప్పిట్లో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు
మంచిర్యాల జిల్లాలో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హజీపూర్ మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండు కుండల మారింది. ఈ ప్రాజెక్ట్ సామర్ధ్యం 20 టి.ఎం.సి లకు గాను దాదాపు 17 టి.ఎం.సి ల వరకు నీరు చేరుకుంది. ఎగువ ప్రాంతంలో ఉన్న కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి వేయడంతో అక్కడి నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రస్తుతం 17 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి 1,30,883 క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు. శుక్రవారం ఉదయం నుండే గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివాసముండే వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. దిగువన ఉన్న పార్వతి బ్యారేజ్ గేట్లు సైతం ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దిగువ ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
లోయర్ మానేరు డ్యామ్ లోకి భారీగా వరద నీరు
భారీగా కురుస్తున్న వర్షాలతో ఎగువ నుండి లోయర్ మానేరు డ్యామ్ లోకి వచ్చి చేరుతున్న వరద నీటిపై ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. శుక్రవారం ఉదయం లోయర్ మానేరు డ్యాం ప్రధాన గేట్ల వద్ద నీటి సామర్థ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారీగా కురుస్తున్న వర్షాలతో ఎగువ నుండి మానేరు డ్యాంలోకి నీరు వచ్చి చేరుతుందని, ప్రస్తుతానికి నీటి నిల్వ సాధారణ స్థాయిలోనే ఉన్నప్పటికి, ఎప్పటికప్పుడు నీటి నిల్వలను పరిశీలించాలని, భారీగా నీరు వచ్చి ప్రమాదస్థాయిని దాటినట్లయితే మానేరు గేట్లను ఎత్తడానికి తగిన ఏర్పాట్లతో అధికారులు సిద్దంగా ఉండాలని, లోతట్టు ప్రాంతం ప్రజలు, అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు.
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి
ఖమ్మం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గోదావరి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కునేందుకు అధికారులు, సిబ్బంది సిద్దంగా ఉండాలని సూచించారు. గోదావరి వరదల నేపథ్యంలో మంత్రి అజయ్ శుక్రవారం భద్రాచలం బ్రిడ్జి వద్ద వరద ఉదృతి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక అధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరద ముంపు ప్రాంతాల బాధితులను తక్షణమే గుర్తించి ముందస్తుగా వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. వరద ఉదృతిని బట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు ముంపుకు గురికాకుండా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
ఇది కూడా చదవండి : Himayat Sagar, Usman Sagar: హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు వరద నీరు.. గేట్లు ఎత్తివేత
కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో జల దిగ్భందంలో చిక్కుకున్న గ్రామాలు
కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లాలోని కౌటాల, బెజ్జూర్, దహేగాం, పెంచికలపేట్, తిర్యాని మండలాలలో గత ఐదు రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగడంతో అనేక గ్రామాలు జలదిబ్బందుల్లో ఉండిపోయాయి, జలదిగ్బంధంలోని పలు గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. ముందస్తు జాగ్రత్తగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో లోతట్టు గ్రామాలు అంధకారంలోకి వెళ్ళాయి. పలు గ్రామాల ప్రజలు గత రెండు రోజులుగా బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో నిత్యావసరాలకు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా చల్లటి గాలులకు వృద్ధులు, పిల్లలు అనారోగ్యాలకు గురవుతున్నారు
ఇది కూడా చదవండి : Electricity Dept Issues: భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లతో ప్రమాదం పొంచి ఉంటే ఈ నెంబర్లలో ఫిర్యాదు చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Telangana Rains Updates: ఏయే జిల్లాల్లో, ఏయే ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉందంటే