Telangana Politics: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిటైముండగానే తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజురోజుకూ పెరిగిపోతోంది. సీఎం కేసీఆర్ మరోసారి ముందస్తుకు సై అంటారనే అంచనాలతో అన్ని పార్టీలు ప్రజాక్షేత్రంలోకి దిగాయి. ఓ వైపు అధికార టీఆర్ఎస్ కేసీఆర్ పాలన, సంక్షేమ పథకాలే ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటోంది. ఇక కేసీఆర్ కుటుంబ పాలనను టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు బీజేపీ చీఫ్ బండిసంజయ్. ప్రజాసంగ్రామ పాదయాత్ర చేస్తూ జనంతో మమేకమైతున్నారు. కొన్నాళ్లు ఈ రేసులో కాస్త వెనకబడ్డట్లు కనిపించిన కాంగ్రెస్ పార్టీ సైతం రేవంత్‌రెడ్డి పీసీసీచీఫ్ అయ్యాక జోరు పెంచింది. వరుస సభలు, ధర్నాలు, ర్యాలీలతో కేడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు రేవంత్‌రెడ్డి. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించాలనే లక్ష్యంతో ముందుకుపోతున్నారు.
మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరులో పైచేయి సాధించడానికి ఎవరికి వారు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ప్రత్యర్థి పార్టీలను మానసికంగా దెబ్బతీసేందుకు ... మంచి పేరున్న నేతలపై ఆకర్ష్ వల విసురుతున్నారు. ఇన్నాళ్లూ జాయినింగ్స్ తప్ప.. పార్టీ నుంచి నేతలు వెళ్లిపోవడం తెలియని టీఆర్ఎస్ కు ఇప్పుడిప్పుడే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే పలువురు నేతలు టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేవంత్‌రెడ్డి పకడ్బందీ వ్యూహంతో అధికార పార్టీకి వరుస షాక్‌లు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు నల్లాల ఓదేలు, ప్రవీణ్‌రెడ్డితో పాటు బడంగ్‌పేట్ మేయర్ , జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ విజయారెడ్డి లాంటి కీలక నేతలు కారుకు హ్యాండిచ్చారు. రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ చేరికలు అటు టీఆర్ఎస్ తో పాటు ఇటు బీజేపీకి కూడా గట్టిషాకే ఇచ్చాయి.
రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక హస్తం పార్టీ దూకుడు పెరిగింది. ఇది బీజేపీకి కలవరం కలిగిస్తోంది. కాంగ్రెస్ పని ఖతమైందని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా తమవైపుకే వస్తుందని ఆశించిన కమలం పార్టీకి ఈ పరిణామాలు మింగుడు పడటం లేదు. దీంతో రేసులో వెనకబడకుండా దిద్దుబాటు చర్యలకు దిగింది బీజేపీ హైకమాండ్. ఈటల రాజేందర్‌కు చేరికల కమిటీ బాధ్యతలు అప్పజెప్పింది. తెలంగాణ ఉద్యమకారులతో పాటు టీఆర్ఎస్ నేతలతో మంచి సంబంధాలున్న ఈటల వెంటనే తన పని ప్రారంభించారు.
టీఆర్ఎస్ అసంతృప్తి నేతలకు గాలం వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఏ పెద్ద నేత కూడా ఇంకా బీజేపీలో జాయిన్ కాలేదు. జాతీయకార్యవర్గ సమావేశాల సందర్భంగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కమలం పార్టీలో చేరారు. అయితే అది ఈటలకు బాధ్యత అప్పగించకముందు జరిగిన జాయినింగ్. దీంతో టీఆర్ఎస్‌నుంచి పెద్ద నేతలను బీజేపీలో చేర్పించి తన సత్తా చాటాలని ఈటల గట్టిగా కృషిచేస్తున్నారు. దీనిద్వారా కేసీఆర్‌కు కూడా తన పవర్ చూయించొచ్చని భావిస్తున్నారు.కానీ ఈటల ఆకర్ష్ వలకు ఇప్పటివరకు ఏ పెద్ద నేతా చిక్కలేదు. పార్టీలో ఎవరుచేరుతున్నారన్న విషయాన్ని చివరిదాకా గోప్యంగా ఉంచాలన్న చేరికల కమిటీ నిర్ణయం మేరకు ఇప్పటివరకు ఈ విషయాలలో గోప్యత పాటిస్తోంది బీజేపీ
ప్రస్తుతం ఆషాఢమాసం. ఈ నెల 28 నుంచి శ్రావణం వస్తుంది. ఇక అప్పటినుంచి పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉంటాయని చెబుతున్నారు ఈటల రాజేందర్. చాలా మంది తనతో టచ్‌లోకి వచ్చారని చెబుతున్నారు. ఆషాఢం కావడం వల్లే ప్రస్తుతం చేరికలకు ఉత్సాహం చూపడం లేదంటున్నారు. ఒకవేళ ఈటల మాటలు నిజమైతే మరో రెండు రోజుల్లోనే బీజేపీలోకి వలసలు ప్రారంభంకావాలి. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మాత్రం అలాంటి సీన్ కనబడటం లేదు. కేసీఆర్ ను కాదని ఇప్పటికిప్పుడు బీజేపీలోకి వచ్చే నేతలు ఎవరనేది పెద్ద ప్రశ్న.
ఇక అధికార టీఆర్ఎస్ లో ఎవరైనా కాస్త అసంతృప్తిగా ఉన్నారంటే వెంటనే అక్కడ వాలిపోతున్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. వారిని ఎలాగో అలా ఒప్పించి పార్టీ కండువా కప్పేస్తున్నారు. బీజేపీలో చేరాలనుకున్నవారిని సైతం తమ పార్టీవైపు చూసేలా చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీనుంచి కూడా కొంతమంది నేతలను లాగి ఆ పార్టీని కూడా గట్టిదెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అలా అయితేనే ప్రత్యామ్నాయం తామేనని జనంలోకి బలంగా వెళ్తుందని రేవంత్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ఆకర్ష్ వలకు అటు టీఆర్ఎస్ తో పాటు బీజేపీ నేతలు కూడా చిక్కే అవకాశముంది. మరోవైపు ఈ పరిణామాలన్నీ జాగ్రత్తగా గమనిస్తున్న టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం.. సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతోంది.
నయానో భయానో పలువురు బీజేపీ, కాంగ్రెస్ నేతలను చేర్చుకొని.. రెండు పార్టీలకు షాకివ్వాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశాలుజరిగే సమయంలో ఆ పార్టీ కార్పొరేటర్లకు గులాబీకండువా కప్పింది. ఇక కాంగ్రెస్ నుంచి కూడా పలువురిని లాగాలని ప్రయత్నిస్తోంది. ఇలా మూడు పార్టీలు చేరికలపై దృష్టి పెట్టడంతో రాజకీయం రసకందాయంలో పడింది. ఎవరు ఏ పార్టీ నుంచి ఎక్కడకు జంప్ చేస్తారో పెద్దపెద్ద రాజకీయ పండితులకు కూడా అంతుచిక్కడం లేదు. ఆషాఢం కారణంగా గత మూడు నాలుగు వారాలుగా ఈ జంపింగ్స్ తగ్గిపోయాయి. ఈటల చెప్పినట్లు శ్రావణమాసంలో పార్టీల్లోకి జాయినింగ్స్ పెరిగే అవకాశముంది. మరి ఇందులో ఎవరు ముందంజలో ఉంటారో తెలియాలంటే మరో వారం పది రోజులు ఓపిక పట్టక తప్పదు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Telangana Rains Live Updates: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కుండపోత వాన... ఆ జిల్లాలకు ఇవాళ భారీ వర్ష సూచన
Also Read : Sravana Remedies 2022: పరమేశ్వరుడు మీ కోరికలు నెరవేర్చాలంటే... ఆగస్టు 11లోపు ఈ చిన్న పని చేస్తే చాలు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook