Telangana lockdown updates: హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తే తప్ప కరోనా పాజిటివ్ కేసులు అదుపులోకి రావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు సైతం ఈ అంశంపై ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం రానే వచ్చింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రేపు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. తెలంగాణలో లాక్ డౌన్ విధించాలా లేదా అనే అంశంపై ఈ కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
దేశంలోని కొన్ని ఇతర రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించినప్పటికీ అక్కడ కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టలేదని తెలంగాణ సర్కారుకు నివేదికలు సైతం అందినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్డౌన్ విధింపుపై (Lockdown in Telangana) రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోనుందా అనే ఉత్కంఠ నెలకొని ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు ఎదురవకుండా ఉండాలనే కోణంలోనూ సీఎం కేసీఆర్ (CM KCR) యోచిస్తున్నట్టు తెలంగాణ సీఎంఓ వర్గాలు తెలిపాయి.