కికి ఛాలెంజ్ స్వీకరిస్తే, చట్టరీత్యా చర్యలు : తెలంగాణ డీజీపీ హెచ్చరిక

Last Updated : Aug 2, 2018, 04:11 PM IST
కికి ఛాలెంజ్ స్వీకరిస్తే, చట్టరీత్యా చర్యలు : తెలంగాణ డీజీపీ హెచ్చరిక

విదేశాల నుంచి భారత్‌కి పాకుతున్న పాశ్చాత్య సంస్కృతి పలు సందర్భాల్లో స్థానిక పోలీసులకు తలనొప్పులు తీసుకొస్తోంది. తాజాగా భారత యువతను ఆకర్షిస్తోన్న కికి ఛాలెంజ్ సైతం పోలీసులకు అలాంటి తలనొప్పులనే తీసుకొచ్చింది. తెలంగాణలో కానీ హైదరాబాద్ రోడ్లపై కానీ కికి ఛాలెంజ్ స్వీకరించే సాహసం చేయొద్దని, లేని పక్షంలో కికీ ఛాలెంజ్ స్వీకరించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న పాప్ సింగర్ డ్రేక్ గత నెలలో విడుదల చేసిన 'ఇన్ మై ఫీలింగ్స్' ఆల్బం పాట పేరుపై ఈ కికి ఛాలెంజ్ పుట్టుకొచ్చింది. 'కికి ఛాలెంజ్' లేదా 'ఇన్ మై ఫీలింగ్స్ ఛాలెంజ్' పేరిట ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఛాలెంజ్ హల్‌చల్ చేస్తోంది. ఇన్ మై ఫీలింగ్స్ అనే పాట ప్లే అవుతుండగా కొద్దిపాటి వేగంతో ప్రయాణిస్తున్న కారులోంచి దిగి ఈ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేయడమే ఈ కికి ఛాలెంజ్ స్వీకరించాల్సిన వాళ్లు చేయాల్సిన పని. 

అయితే, అలాంటి కికి ఛాలెంజ్‌తో రోడ్లపై దుస్సాహసాలకు పాల్పడి తమ ప్రాణాల మీదకు తీసుకొచ్చుకోవద్దని డీజీపీ మహేందర్ రెడ్డి యువతకు సూచించారు. ఈ ఛాలెంజ్‌ కారణంగా రోడ్డుపై రాకపోకలు సాగించే ఇతరుల ప్రాణాలకు సైతం ముప్పు తలెత్తే ప్రమాదం ఉందని డీజీపీ తెలిపారు. కికి ఛాలెంజ్‌కి పాల్పడే వారిపై, వారికి సహకరించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతోపాటు వారి డ్రైవింగ్ లైసెన్స్ సైతం రద్దు చేస్తామని డీజీపి స్పష్టంచేశారు. 

Trending News