KCR NATIONAL POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీని వ్యతిరేస్తున్న పలు పార్టీల నేతలతో చర్చలు జరిపారు. ఇటీవలే ఢిల్లీలో వారం రోజులు ఉండివచ్చారు కేసీఆర్. జాతీయ రాజకీయాలపై కీలక చర్చలు జరిపారనే వార్తలు వచ్చాయి. ఇంతలోనే బీహార్ లో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఎన్డీఏ కూటమికి షాకిచ్చిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్.. ఆర్డేడీ, కాంగ్రెస్ తో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. బీహార్ లో నితీష్ బీజేపీకా టాటా చెప్పడం వెనుక కేసీఆర్ పాత్ర ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కొన్ని నెలలుగా నితీశ్ కుమార్ తో కేసీఆర్ టచ్ లో ఉండటం.. గత జనవరిలో తేజస్వీ యాదవ్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ సమావేశం కావడం.. ఇటీవల ఢిల్లీ పర్యటనలో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ .. కేసీఆర్ ను కలిసి సుదీర్ఘంగా చర్చంచడం ఈ కథనాలకు బలాన్నిచ్చాయి.
బీహార్ లో పరిణామాల్లో కేసీఆర్ లింక్ ఉందనే వార్తలకు మరింత బలం చేకూరనే పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు బీహార్‌లో పర్యటించబోతున్నారు. శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో కేసీఆర్ పాట్నా వెళ్లనున్నారని తెలుస్తోంది. శనివారం రాత్రికి అక్కడే బస చేసే అవకాశం ఉందంటున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను అభినందించనున్నారు కేసీఆర్. వారితో సమావేశమై పలు అంశాలపై చర్చిచంనున్నారు. సైన్యంలో పనిచేస్తూ వీరమరణం పొందిన అమరు జవాన్ల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించనున్నారు. కేసీఆర్ కార్యక్రమంలో బీహార్ సీఎం నితీశ్ , డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పాల్గొంటారని తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ హైదరాబాద్ తిరిగివస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
బీహార్ లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ పాట్నా పర్యటన దేశ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటానికి ప్రణాళికలు రచిస్తున్న కేసీఆర్.. బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రితో మమతా బెనర్జీతో ఇప్పటికే చర్చలు జరిపారు. మంబై వెళ్లి శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే, ఎన్సీపీ నేత శరద్ పవార్ తో మంతనాలు సాగించారు. బెంగళూరులో జేడీఎస్ అధినేత, దేశ మాజీ ప్రధానమంత్రి దేవేగౌడతోనూ కేసీఆర్ చర్చలు జరిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ కూడా కేసీఆర్ తో కలిసి పని చేసేందుకు సిద్ధమని తెలిపారు. సమాద్ వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తోనూ పలుసార్లు సమావేశమయ్యారు కేసీఆర్. తాజాగా బీహార్ ముఖ్యమంత్రితోనూ చర్చలు జరుపుతుండటం ఆసక్తిగా మారింది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటులో కేసీఆర్ మరింత దూకుడు పెంచనున్నారని తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ బీహార్ పర్యటనకు సంబంధించి ఇంకా అధికారక ప్రకటన ప్రగతి భవన్ నుంచి రాలేదు. అయితే ఈనెల 14న సీఎం కేసీఆర్ వికారాబాద్ జిల్లా పర్యటన ఖరారైంది. వికారాబాద్ లో నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభిస్తారని షెడ్యూల్ వచ్చింది. అయితే కేసీఆర్ వికారాబాద్ పర్యటన ఈనెల 16వ తేదీకి వాయిదా పడింది. కేసీఆర్ బీహార్ పర్యటనకు వెళుతున్నందునే వికారాబాద్ టూర్ వాయిదా పడిందని తెలుస్తోంది. బీహార్ సీఎం తో కేసీఆర్ సమావేశం తర్వాత దేశ రాజకీయాల్లో మరికొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Also Read : Raksha Bandhan Special Horoscope : రక్షా బంధన్ స్పెషల్.. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారి జాతకం ఎలా ఉందంటే..
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook