CM KCR to visit Delhi Today: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత విచారణ తెలంగాణ రాజకీయ వర్గాల్లో కాక రేపుతోంది. ఆదివారం దాదాపు ఏడు గంటలపాటు విచారించి సీబీఐ అధికారులు.. కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది. సీఆర్పీసీ 91 కింద మరోసారి నోటీసులు జారీ చేసి.. విచారణకు మళ్లీ ఎప్పుడైన పిలుస్తామని చెప్పారు. కవితను ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులు, కొంతమంది మంత్రులతో కలిసి సీఎం హస్తినకు బయలు దేరనున్నారు. సీబీఐ విచారణ, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు సీఎం కేసీఆర్. ఈ టూర్‌లో బీఆర్ఎస్ తాత్కాలిక ఆఫీస్‌ను ప్రారంభించనున్నారు. పార్టీ కార్యాలయంలో రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, నటుడు ప్రకాష్ రాజ్, రాజకీయ ప్రముఖులు, రైతు సంఘాల నేతలు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యాలయ ప్రారంభ పనులు పూర్తి అయిన తరువాత.. జాతీయ మీడియాతో మాట్లాడనున్నారు. దేశ రాజకీయ పరిస్థితులపై ఆయన మాట్లాడబోతున్నట్లు తెలిసింది.
సోమవారం రాత్రి రిటైర్డ్ అధికారులు, సీనియర్ జర్నలిస్టులతో ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు. రేపు, ఎల్లుండి సర్దార్ పటేల్ రోడ్డులోని బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయంలో జరగనున్న రాజశ్యామల యాగంలో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 14వ తేదీన కార్యాలయం ప్రారంభించి.. అదేరోజు సాయంత్రం జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశముంది. 15వ తేదీన వసంత్ విహార్‌లో నిర్మితమవుతున్న బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయం పనులను పరిశీలించనున్నారు. హస్తిన టూర్‌లో బీఆర్ఎస్ సంస్ధాగత నిర్మాణంపై సీనియర్ లీడర్స్‌తో చర్చించనున్న కేసీఆర్.. 16వ తేదీ వరకు ఢిల్లీలోనే మకాం వేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాజశ్యామల యాగం నిర్వహించడం కేసీఆర్‌కు సెంటిమెంట్‌గా మారింది. గతంలో రెండుసార్లు ఎన్నికలకు ముందు ఆయన ఈ యాగాన్ని నిర్వహించారు. మరోసారి అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. బీఆర్ఎస్‌ను స్థాపించడం.. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో మళ్లీ రాజశ్యామల యాగం నిర్వహిస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదేధంగా ఢిల్లీ టూర్‌లో బీఆర్‌ఎస్ జాతీయ కమిటీని ప్రకటించే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Janasena: ఎన్నికల్లో పొత్తులపై నాదెండ్ల కీలక వ్యాఖ్యలు.. పవన్ కళ్యాణ్ చెప్పినట్లే..!
Also Read: Telangana Rains: మాండౌస్ తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలో మరో 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
CM KCR Delhi Tour: నేడు సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్.. అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్న గులాబీ బాస్