Bandi Sanjay in Karnataka Elections Campaign: కర్ణాటక ఎన్నికల్లో ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన డబ్బులతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధమైందన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో లేదని.. ఆ పార్టీ ఖేల్ ఖతం.. దుకాణం బంద్ కాబోతోందన్నారు. కర్ణాటకలో ఎన్నికలు జరుగుతుంటే జాతీయ పార్టీ పెట్టి పోటీ చేస్తానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో తిరుగుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. రేపు దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే.. పాకిస్థన్ వెళ్లి ప్రచారం చేస్తారేమోనని ఎద్దేవా చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు గౌరీబిదనూరు, బాగేపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు.
'వచ్చే నెల 10న జరగబోయే ఎన్నికల్లో పోలింగ్ బాక్స్ బద్దలయ్యేలా పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీని గెలిపించండి. ఒక్కొక్కరు వంద ఓట్లు వేయించండి. బాగేపల్లి బీజేపీ అభ్యర్ధి మునిరాజు ఎమ్మెల్యేగా గెలిపించండి. మళ్లీ విజయోత్సవ సభకు సీటీ రవితో కలిసి ఇక్కడికే వస్తా.. ఈ ప్రాంతంలో బీజేపీకి ఓటేయకపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులిస్తున్నాయి. అయినా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నడు. అట్లాంటప్పుడు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలి..? గత ఎన్నికల టైంలో అర్ద రూపాయికే టీ, టిఫిన్ పెడతానన్నడు. 5 రూపాయలకే భోజనం పెడతానన్నడు.. ఆ హామీలు ఎటుపోయినయ్..? ఈ ప్రాంతంలో బార్, బీరు తప్ప అభివృద్ధి జరిగిందా..? ఒక్క ఫ్యాక్టరీ, పరిశ్రమైనా వచ్చిందా..?
సిట్టింగ్ ఎమ్మెల్యే కరోనా టైమ్ ఇంట్లో పడుకుంటే.. బీజేపీ అభ్యర్ధి మునిరాజు కరోనాను లెక్క చేయకుండా మీకు సేవ చేసిండు. తనకు ఫ్యామిలీ కంటే ప్రజలే మిన్న అని నిరూపించిండు. ప్రజలను గాలికొదిలేసే నాయకుడు కావాలా..? మీ కష్టాలను పంచుకునే మునిరాజు కావాలా..? ఎన్నికలప్పుడే మీ వద్దకొచ్చి పైసల ఆశ చూపే కాంగ్రెస్ కావాలా..? నిత్యం ప్రజల్లో ఉండే మునిరాజు కావాలా..? ఆలోచించండి..' అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటుకు రూ.10 వేల పంచేందుకు సిద్ధమైందన్నారు బండి సంజయ్. ఆ పైసలన్నీ తెలంగాణ సీఎం కేసీఆర్ పంపినవేనని.. వాటినే పంచేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యాన్నారు. ఒక్క పైసా తక్కువిచ్చినా ఊరుకోకండనని.. ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఓట్లేసి కాంగ్రెస్‌ను ఖతం చేయాలన్నారు. కేసీఆర్ మహా తెలివైన వారని.. మొన్నటిదాకా జేడీఎస్‌కు పైసలిచ్చారని.. ఆ పార్టీ అధికారంలోకి రాదని తెలిసేసరికి కాంగ్రెస్ పంచన చేరారని విమర్శించారు. కుమారస్వామి ఫోన్ చేసినా ఎత్తడం లేదని.. కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఢిల్లీలో అధికారంలో లేదని.. ఈ ప్రాంతంలో గెలిస్తే ఉపయోగమేముంది..? అని ప్రశ్నించారు. పొరపాటున ఆ పార్టీకి ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని అన్నారు.
Also Read: Liquid DAP: రైతులకు గుడ్‌న్యూస్.. లిక్విడ్ డీఏపీ వచ్చేసింది.. ధర ఎంతంటే..?
'80 శాతం హిందువులున్న భారత్‌లో అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఇన్నేళ్లు పట్టిందా..? ఎంతోమంది కరసేవకులు ప్రాణత్యాగాలు చేయడమా..? అని ప్రపంచమంతా ఆశ్చర్యపోతోంది. కరసేవకుల బలిదానాల స్పూర్తితో మోదీ గారు అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామమందిరం నిర్మిస్తున్నారు. 370 ఆర్టికల్ రద్దు కోసం ఎంతోమంది బలిదానమయ్యారు. వారి త్యాగాలను వృథా కాకూడదని 370 ఆర్టికల్‌ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని నిరూపించారు.
బాగేపల్లిలో సమస్యలపై ప్రశ్నేంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలను కాంగ్రెసోళ్లు బెదిరిస్తున్నరు. రౌడీషీట్ తెరుస్తున్నరు. మీకు న్యాయం జరగాలంటే బీజేపీని గెలిపించండి. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేయడంతోపాటు ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 5 నుండి 7 శాతానికి పెంచిన ఘనత బీజేపీదే. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లిం రిజర్వేషన్లను పెంచుతారు. మీ నిధులు మీకు రావాలంటే బీజేపీని గెలిపించండి. అభివృద్ధి జరగాలంటే బీజేపీకే ఓటేయండి. బాగేపల్లిలో ఇంతవరకు బీజేపీ గెలవలేదు. ఈసారి ఓటేసి గెలిపించి మోదీకి గిఫ్ట్ ఇవ్వండి. అభివృద్ది చేసి చూపిస్తాం..' అని బండి సంజయ్ అన్నారు.
Also Read: Hyderabad Bangles Market: గాజుల షాపింగ్‌కు ఇక్కడికి వెళ్లండి.. అదిరిపోయే డిజైన్లు ఉన్నాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook