Revanth Reddy Slams KCR: కేసీఆర్ ఎములాడ రాజన్నను కూడా మోసం చేసిండు: రేవంత్ రెడ్డి

Revanth Reddy Slams KCR : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు 40 ఏళ్ల కింద ఇక్కడ లగ్గం అయిందని చెప్పిండు. అప్పట్లో ఆయనకు ఇక్కడ లగ్గం అయిందో లేదో తెలియదు కానీ... వేములవాడ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆయన లగ్గం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు " అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Written by - Pavan | Last Updated : Mar 6, 2023, 04:15 AM IST
Revanth Reddy Slams KCR: కేసీఆర్ ఎములాడ రాజన్నను కూడా మోసం చేసిండు: రేవంత్ రెడ్డి

Revanth Reddy Speech At Vemulawada : " ఎములాడ రాజన్న ఆలయానికి ప్రతీ ఏటా 100 కోట్లు రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన సీఎం కేసీఆర్.. ఆ దేవుడిని కూడా మోసం చేసిండు " అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. ఇక్కడికి వచ్చే భక్తులకు తాగు నీటి సమస్యను కూడా తీర్చలేకపోయాడు. 40ఏళ్ల కింద తనకు ఇక్కడే పెళ్లి జరిగిందని... ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని గతంలో కేసీఆర్ చెప్పిండు. 40 ఏళ్ల కింద కేసీఆర్‌కు ఇక్కడ లగ్గం అయిందో లేదో తెలియదు కానీ... వేములవాడ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆయన లగ్గం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు " అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా 21వ రోజైన ఆదివారం వేములవాడ నియోజకవర్గం పరిధిలోని సంకెపల్లి గ్రామం నుంచి వేములవాడ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో  ప్రసంగిస్తూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, " గుడిని, గుడిలో లింగాన్ని దిగమింగే ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతోంది. 2018లో చెన్నమనేని రమేష్ ఒడిపోతాడనే భయంతో సూరమ్మ ప్రాజెక్టుకు శిలాఫలకం వేశారు. 43,100 ఎకరాలకు సాగు నీరు అందిస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచారు. ఇన్నేళ్లయినా అందులోంచి తట్ట మట్టి కూడా తీయలేదు. ఈ ప్రాంతంపై కేసీఆర్ వివక్ష చూపుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన వివక్షనే.. కేసీఆర్ పాలనలోనూ కొనసాగుతోంది " అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

వేములవాడ ఎమ్మెల్యేను కలవాలంటే జర్మనీకి పోవాలా ?
వేములవాడ ఎమ్మెల్యేను కలవాలంటే జర్మనీకి పోవాల్సిన ఖర్మ పట్టింది. వేములవాడ నియోజక వర్గం ప్రజలపై ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు ప్రేమ లేదు. అందుకే ఇక్కడి పౌరసత్వం వదులుకున్నారు. ప్రజలతో బంధం తెంచుకున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే.. ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి.. మిడ్‌మానేరు బాధితులుగా కేసీఆర్ కుటుంబం ఆర్ అండ్ ప్యాకేజీ తీసుకున్నారు. కానీ పెళ్లైన గిరిజన ఆడ బిడ్డలకు మాత్రం ఇవ్వనంటున్నారు.. మీ కుటుంబానికి ఒక న్యాయం... మా గిరిజన బిడ్డలకు ఒక న్యాయమా ? కేసీఆర్ కు కొంచెమైనా బాధ్యత ఉందా ? వేలకోట్లు ఉన్న మీ కుటుంబం.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ తీసుకుని పేదల పొట్ట కొడతారా అని ప్రశ్నించారు. 

ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. 
తెలంగాణ తెచ్చిన అన్న వారికి రెండుసార్లు అవకాశం ఇచ్చారు.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఒక్క అవకాశం ఇస్తే... ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు సాయం అందిస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం. ప్రతీ పేద రైతులు రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటాం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. ప్రతీ పేద ఆడబిడ్డకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. కళికోట సూరమ్మ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేసి 43వేల ఎకరాలకు నీరందిస్తాం. గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆదుకుంటాం రేవంత్ రెడ్డి వేములవాడ నియోజకవర్గ ప్రజలపై హామీల వర్షం కురిపించారు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x