హైదరాబాద్: ఖమ్మం డిపో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి ప్రభుత్వ వైఖరే కారణమని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. డీఆర్డీవో హాస్పిటల్లో శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ యాదవ్‌లపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె చేపడతామని నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా చర్చలకు పిలవకుండా కార్మికులను అవమానించారని అన్నారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు, కార్మికులు అందరూ తమని తాము సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నట్టేనని ప్రకటించి ప్రభుత్వం వారిని మరింత భయాందోళనకు గురిచేసింది. ప్రభుత్వ మొండివైఖరి, నిర్లక్ష్య వైఖరి కారణంగానే శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తిందే తప్ప మరొకటి కాదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఆత్మహత్యకు పురిగొల్పిన వారిని ఐపీసీ 306 ప్రకారం కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలని వ్యాఖ్యానించారు.
శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ స్పందించకపోవడం చాలా దారుణం అని ప్రభుత్వ వైఖరిపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్సకు కూడా ప్రభుత్వం సహకరించలేదు. హాస్పిటల్ ఖర్చులు సైతం తామే భరిస్తామని చెప్పామన్నారు.
తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆత్మహత్యకు పాల్పడిన శ్రీకాంతా చారి ఇదే హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. ఆ తర్వాతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది.. తెలంగాణను సాధించుకునేలా చేసిందని గుర్తుచేసిన రేవంత్ రెడ్డి... మళ్లీ ఇవాళ ఇదే హాస్పిటల్లో శ్రీనివాస్ రెడ్డి కన్నుమూయడం కూడా మరో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటానికి నాందిలాంటిదేనని అభిప్రాయపడ్డారు.