తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడని నమ్మబలికి.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని కొందరు యువకులను బురిడీ కొట్టించి రూ.70 లక్షలు కాజేశాడు ఓ ప్రబుద్ధుడు. వివరాల్లోకి వెళితే వరంగల్ మండీబజార్‌కు చెందిన మహ్మద్ ఖిఫాయత్ అలీ గత కొంతకాలంగా అదే జిల్లాలో సచివాలయం ఉద్యోగిగా చెలామణీ అవుతూ స్థానికంగా పరిచయాలు పెంచుకోవడం మొదలు పెట్టాడు.
ఓ గన్ మెన్‌ను కూడా అపాయింట్మెంట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో వరంగల్, హైదరాబాద్ ప్రాంతాల్లో చాలామంది యువకులను నమ్మించి ఉద్యోగాలు ఇప్పిస్తానని మాటిచ్చి రూ.70 లక్షల వరకూ కొల్లగొట్టాడు. ఇటీవలే రాచకొండ ఎస్వోటీ బృందం చేసిన దర్యాప్తులో ఇతని బండారం బయటపడింది. రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ ఎం భగవత్ మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలు తెలిపారు.
ఎర్రబుగ్గ కలిగిన కారును ఉపయోగించడంతో పాటు ప్రభుత్వ వెహికల్ స్టిక్కర్లను కూడా వాహనానికి అతికించడంతో చాలామంది స్థానికులు, మహ్మద్ ఖిఫాయత్ అలీని సచివాలయ ఉద్యోగిగా పొరబడ్డారని.. ఇదే క్రమంలో అతని మాయమాటలు నమ్మి కొందరు యువకులు ఉద్యోగాలు వస్తాయని భ్రమించి భారీ స్థాయిలో డబ్బు అందించారని తెలిపారు. దాదాపు ఒక్కో నిరుద్యోగి నుండి రూ.1 లక్ష నుండి రూ.3 లక్షల వరకూ కాజేయడంతో పాటు.. ఆ తర్వాత మొహం చాటేయడంతో.. మోసపోయామని తెలుసుకొని డబ్బు ఇచ్చిన వ్యక్తులు పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారని తెలిపారు.
ఉద్యోగాల పేరుతో టోకరా వేసే పద్ధతికి మహ్మద్ ఖిఫాయత్ అలీ మూడు సంవత్సరాల క్రితమే నాంది పలికినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇటీవలే మహ్మద్ ఖిఫాయత్ అలీతో పాటు అతనికి గన్‌మెన్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తిని పోలీసులు ఓ పథకం ప్రకారం పట్టుకొని వారి వద్ద నుండి మూడు కార్లు, ఒక బైక్, రెండు మొబైల్ ఫోన్లు, రూ.1 లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు.