Attack On Bairi Naresh After Preethi's Death: హన్మకొండ: హన్మకొండ పట్టణం గోపాల్‌పూర్‌లో నాస్తికుడు బైరి నరేష్‌పై అయ్యప్ప భక్తులు దాడికి పాల్పడ్డారు. పోలీస్ వెహికిల్‌లో ప్రొటెక్షన్‌తో వెళ్తున్న నరేష్‌ని కిందకు లాగి దేహశుద్ధి చేసినట్టు తెలుస్తోంది. గతంలో అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అయ్యప్ప స్వామి భక్తుల ఆగ్రహానికి గురైన కేసులో భైరి నరేష్ జైలుకి వెళ్లొచ్చాడు. జైలు నుండి విడుదలై బయటకు వచ్చిన తరువాత సైతం మరోసారి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వివాదాస్పద వాఖ్యలు చేసి వార్తల్లోకెక్కిన బైరి నరేష్ పై అప్పటి నుంచే హిందూ సంఘాలు మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నాయి.
తాజాగా సోమవారం మధ్యాహ్నం బైరి నరేష్ హన్మకొండలో డా. బి.ఆర్. అంబేద్కర్ భవన్ కి వెళ్లి వస్తున్న క్రమంలో మధ్యలో అతడిని పట్టుకున్న హిందూ సంఘాలకు చెందిన నేతలు, యువకులు.. అతడికి దేహశుద్ధి చేసి తమ ఆగ్రహం తీర్చుకున్నారు. ఈ ఘటనలు అతడి బట్టలు ఊడదీసి కొట్టినట్టు తెలుస్తోంది.
పోలీసులు అతికష్టం మీద బైరి నరేష్‌ని తమ వాహనం ఎక్కించుకుని అతడికి రక్షణ కల్పిస్తూ తీసుకువెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ.. అతడి మీద తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న హిందూ సంఘాల నేతలు, అయ్యప్ప స్వామి భక్తులు.. పోలీసు వాహనంలోకి చొరబడి మరీ దాడికి పాల్పడ్డారు. బైరి నరేష్ తీరు మార్చుకుని హిందువులకు క్షమాపణలు చెప్పేంత వరకు అతడికి బుద్ది చెప్పడం జరుగుతుంది అని ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు, ఇతర హిందూ సంఘాల నేతలు బైరి నరేష్ కి హెచ్చరికలు జారీచేశారు.
బైరి నరేష్ పై దాడి నేపథ్యంలో హన్మకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలావుంటే, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సైఫ్ ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందిన డా ప్రీతి ఉదంతం వరంగల్, హన్మకొండ, కాజీపేట జంట నగరాలను అట్టుడికించింది. అదే సమయంలో బైరి నరేష్ పై దాడి ఉదంతం చోటుచేసుకోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. డా ప్రితీ మృతిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రస్తుత నేపథ్యంలోనే బైరి నరేష్ పై దాడి జరగడం చూస్తోంటే.. డా ప్రీతి మృతికి సమాధానం చెప్పలేక ఆమె మృతిని కనుమరుగు చేస్తూ అంతకంటే ముందే అన్‌పాపులర్ అయిన బైరి నరేష్ ఉదంతాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చే కుట్ర జరిగిందా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.