Prashant Kishore Survey: ప్రశాంత్ కిషోర్ ఎఫెక్ట్: టీఆర్ఎస్‌లో సిట్టింగులకు ఇక చుక్కలేనా ?

Prashant Kishore Survey in Telangana : తెలంగాణలో ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన గులాబీదళం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని అందుకు తగ్గట్లే ఇప్పటి నుంచే కసరత్తులు ముమ్మరం చేసింది. దానిలో భాగంగానే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్‌తో పని చేయించుకుంటోంది టీఆర్ఎస్.

Last Updated : Jun 28, 2022, 08:55 PM IST
  • ప్రశాంత్ కిషోర్ టీమ్‌తో పని చేయించుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ
  • జిల్లావారిగా అభ్యర్థుల పనితీరు, గెలుపోటములపై సర్వే
  • సగానికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయే ప్రమాదం ఉన్నట్లు పీకే టీమ్ రిపోర్ట్
Prashant Kishore Survey: ప్రశాంత్ కిషోర్ ఎఫెక్ట్: టీఆర్ఎస్‌లో సిట్టింగులకు ఇక చుక్కలేనా ?

Prashant Kishore Survey in Telangana : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ పట్టుకుందా, ఆ టెన్షన్ పేరు పీకేనా అంటే అవుననే మాటే ఎక్కువ వినిపిస్తుంది. ఎన్నికల్లో గెలుపోటములకంటే ముందు సీట్ వస్తుందా రాదా అనే భయమే వారిని ఎక్కువ వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ భయానికి పీకే కేసిఆర్‌కు ఇచ్చిన రిపోర్టే కారణంగా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. 

తెలంగాణలో ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన గులాబీదళం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని అందుకు తగ్గట్లే ఇప్పటి నుంచే కసరత్తులు ముమ్మరం చేసింది. దానిలో భాగంగానే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్‌తో పని చేయించుకుంటోంది టీఆర్ఎస్. ఇప్పటికే తెలంగాణ జిల్లాలలో సర్వేలు చేస్తూ పని ప్రారంభించిన పీకే టీమ్ సర్వే ఫలితాలను ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి అందించినట్లు తెలుస్తోంది.

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, అక్రమాలు, టీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థుల గెలుపు అవకాశాలు, అభ్యర్థులను మారిస్తే గెలిచే అవకాశాలు ఎట్లా ఉంటాయి, స్థానికంగా పార్టీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలతోపాటు విపక్ష పార్టీల బలాలు, బలహీనతలపైన వారి అభ్యర్థులపైన ఫోకస్ పెట్టింది.

జిల్లావారిగా అభ్యర్థుల పనితీరు, గెలుపోటములపై సర్వే చేయిస్తే షాకింగ్ ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకున్నా.. సగానికిపైగా సిట్టింగులపై నెగిటివిటీ పెరిగినట్లు సమాచారం.

ఇక టీఆర్ఎస్ బలంగా ఉండే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్ వంటి జిల్లాలలో సైతం సగానికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయే ప్రమాదం ఉన్నట్లు పీకే టీమ్ రిపోర్ట్ చేసిందట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా.. 90 కి పైగా సీట్లు గెలుస్తామంటూ సీఎం, ఇతర నేతల ప్రకటనలు కేవలం మేకపోతు గాంబిర్యం లాంటిదేననే ప్రచారం రాజకీయ వర్గాల్లో గట్టిగా జరుగుతోంది. 

ఇక పీకే టీం రిపోర్ట్ లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై, ఐదారుగులు మంత్రులపై వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సీఎంకు సన్నిహితంగా ఉండే కరీంనగర్ కు చెందిన మంత్రి, నల్గొండకి చెందిన మరో మంత్రి, టీఆరెస్ యువరాజుకు దగ్గరగా ఉండే మరో మంత్రి సైతం వ్యతిరేకత ఎదుర్కుంటున్న జాబితాలో ఉండటం కొసమెరుపు. 

గ్రూప్ తగాదాలు, పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపం, కార్యకర్తలకు ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం కూడా వ్యతిరేకతకు కారణాలుగా నిలుస్తున్నాయి. దాంతోపాటు నియోజకవర్గానికి ఒకరికంటే ఎక్కువమంది ఆశావహులు ఉండటం కూడా ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందనే వాదన వినబడుతోంది. 

మూడోసారి అధికారపీఠం దక్కించుకోవాలంటే సిట్టింగులను మార్చడం తప్ప వేరే మార్గమేలేనట్లు నివేదికలు అందడంతో వ్యతిరేకత వ్యక్తమైన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇదెక్కడి తలనొప్పిరా అంటూ తలలు పట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో సిట్టింగులను మార్చకుండా ఎన్నికలకు వెళ్లిన టీఆరెస్ ఈ సారి అదే వ్యూహాన్ని అవలంబిస్తుందా లేదా సిట్టింగులకు షాక్ ఇస్తుందా అనే చర్చ టీఆరెస్ వర్గాల్లో జోరుగా సాగుతుంది.

Trending News