PM MODI HYDERABAD TOUR: తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం చుట్టే తిరుగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న ప్రధాన పార్టీలు గెలుపు కోసం పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. తమ బలగాలను మునుగోడులోనే మోహరిస్తున్నాయి. సోమవారమే మునుగోడు బైపోల్ షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దసరా తర్వాత శుక్రవారం ఈనెల 7న నోటిఫికేషన్ రానుంది. నవంబర్ 3న పోలింగ్. పోలింగ్ షెడ్యూల్ రావడంతో దసరా తర్వాత రోజు నుంచి పూర్తి స్థాయిలో మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం చేసేందుకు పార్టీలు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం జరగబోతోంది. ఆగస్టులో తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. మరోసారి హైదరాబాద్ రాబోతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ సమయంలోనే ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
ఈనెల 10వ తేదీ నుంచి 14 వరకు మాదాపూర్ హెచ్‌ఐసీసీలో UNWGIC సదస్సు జరగనుంది. ఐదు రోజుల జరగనున్న సదస్సులో రెండవ రోజు ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఈనెల 11వ తేదీన ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తున్నారు. ఐక్యరాజ్య సమితి, కేంద్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 115 దేశాల నుంచి 550 మందికిపైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. జియోస్పేషియల్ రంగంలో భారత్ సాధించిన ప్రగతిని చర్చిస్తారు. ప్రధాని మోడీ హైదరాబాద్ కు పర్యటనకు సంబంధించి పీఎంఓ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది.కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
మునుగోడు బైపోల్ నోటిఫికేషన్ వచ్చాకా నాలుగు రోజులకే ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తున్నారు. దీంతో ప్రధాని పర్యటనకు మునుగోడు ఉప ఎన్నికలో తమకు కలిసివచ్చేలా తెలంగాణ బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. జూలై, ఆగస్టులో ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చారు. ఆగస్టు మొదటి వారంలో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం మోడీ వచ్చారు. మూడు రోజులు ఇక్కడే ఉన్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన పార్టీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతకుముందు జూలైలో ఐఎస్బీ స్నాతకోత్సవానికి మోడీ హాజరయ్యారు. ఇది అధికారక కార్యక్రమం అయినా.. బేగంపేట ఎయిర్ పోర్టులో పార్టీ నేతలతో సమావేశమయ్యారు ప్రధాని మోడీ. అక్కడే ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
అక్టోబర్ 11న అధికారిక పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వస్తున్నా.. బీజేపీ నేతలతో ఆయన సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పార్టీ ముఖ్య నేతలతో మునుగోడు ఉప ఎన్నికపై చర్చించవచ్చని అంటున్నారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తుండటం తమకు కలిసివస్తుందని కమలనాధులు చెబుతున్నారు.
Read Also: గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్నికోట్లు రాబట్టాలంటే?
Read Also: Rohit Sharma : టీ20 ప్రపంచకప్ కు రోహిత్ శర్మ దూరమా? ముక్కు నుంచి రక్తం కారడంతో అభిమానుల్లో ఆందోళన...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook