PM Modi Telangana visit: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వివరాలు

PM Modi Telangana visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తున్నారని.. 1వ తేదీన పాలమూరులో.. 3వ తేదీన ఇందూరులో పర్యటిస్తారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతోపాటు, పూర్తయిన పలు ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

Written by - Pavan | Last Updated : Sep 30, 2023, 12:51 PM IST
PM Modi Telangana visit: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వివరాలు

PM Modi Telangana visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తున్నారని.. 1వ తేదీన పాలమూరులో.. 3వ తేదీన ఇందూరులో పర్యటిస్తారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతోపాటు, పూర్తయిన పలు ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా  పర్యటనలో.. మోదీ చేతుల మీదుగా రూ.13,545 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరగనుంది. రూ.505 కోట్లతో నిర్మించిన మునీరాబాద్-మహబూబ్‌నగర్ ప్రాజెక్టులో భాగమైన.. ‘జక్లేర్-కృష్ణ’ కొత్త లైన్‌ను జాతికి అంకితం చేస్తారు.

ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ - గోవా మధ్య 102 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. కృష్ణ స్టేషన్‌ నుంచి ‘కాచిగూడ - రాయచూర్ - కాచిగూడ’ డెమూ సర్వీస్‌‌ను ప్రారంభిస్తారు. జాతీయ రహదారులకు సంబంధించిన రూ. 6,404 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన  చేయనున్నారు. రూ.2,457 కోట్లతో నిర్మించిన NH 365 BBలో భాగమైన సూర్యాపేట-ఖమ్మం ఫోర్‌‌లేన్‌ను మోదీ ప్రారంభిస్తారు. దీంతోపాటుగా రూ.2,661 కోట్ల విలువైన.. హసన్ (కర్ణాటక) - చర్లపల్లి HPCL LPG పైప్‌లైన్ ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా.. 37 లక్షల మంది వినియోగదారులకు LPG గ్యాస్ అందించే వెసులుబాటు ఉంది. తెలంగాణలో 230 కిలోమీటర్ల మేర ఈ పైప్‌లైన్ ఉండగా.. కేవలం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే 130 కిలోమీటర్ల పాటు ఈ HPCLపైప్‌ లైన్ ఉంటుంది. తిమ్మాపూర్ లోని IOCL ప్లాంటుకు ఈ పైప్‌లైన్ ను కనెక్ట్ చేస్తే.. అదనంగా మరో 35 లక్షల మంది వినియోగదారులకు గ్యాస్ అందించే అవకాశం ఉంది. దీంతోపాటుగా..  రూ. 1,932 కోట్లతో.. కృష్ణపట్నం (ఆంధ్రప్రదేశ్) -  హైదరాబాద్ మధ్య ‘మల్టీ ప్రాడక్ట్ పైప్‌లైన్’కు (డీజిల్, పెట్రోల్, కిరోసిన్, జెట్ ఫ్యూయల్..) శంకుస్థాపన చేస్తారు. ఇది తెలంగాణ భవిష్యత్ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు ఇస్తున్న మరో కానుక.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రూ.81.27 కోట్లతో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ & స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ & కమ్యూనికేషన్స్ భవనాలను మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారు. దేశంలో మౌలికవసతుల కల్పనను వేగవంతం చేసేందుకు ప్రధాన మంత్రి మోదీ ‘హీరా’ మోడల్‌ (H- హైవేస్, I- ఇన్ఫోవేస్, R- రైల్వేస్, A- ఎయిర్‌వేస్ అభివృద్ధి) తో ముందుకెళ్తున్నారు. తెలంగాణకు రికార్డు స్థాయిలో రూ.లక్షా పదివేల కోట్ల విలువైన (1.10 లక్షల కోట్లు) జాతీయ రహదారులను కేటాయించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలంగాణలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే.. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ 9 ఏండ్లలోనే 2500 కిలోమీటర్ల హైవేస్ తెలంగాణ ప్రజలకు వినియోగంలోకి వచ్చాయి. మరో 2200 కిలోమీటర్ల హైవేలు నిర్మాణంలో ఉన్నాయి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. RRR వంటి పలు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు 50 శాతం నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ.. కేసీఆర్ ప్రభుత్వం సహకరించని కారణంగా ఈ ప్రాజెక్టులు ఆగిపోతున్నాయి అని ఆరోపించారు.ప్రధాని మోదీ చేతుల మీదుగా.. తెలంగాణలోని 22 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు ఇటీవలే శంకుస్థాపన జరిగింది. రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను.. అదే విధంగా..  నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల ఆధునీకరణ జరగనుంది. దేశవ్యాప్తంగా 34 వందేభారత్ రైళ్లు ఇస్తే.. తెలంగాణకే 3 రైళ్లను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు.

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే బడ్జెట్‌ను గణనీయంగా పెంచుతోందని చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. 2014లో తెలంగాణ రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ రూ.258 కోట్లు కాగా 2023లో ఇది రూ.4,418 కోట్లకు పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాజెక్టులను పేపర్ పైనే చూపించేది. వారు శంకుస్థాపనలు చేసిన అనేక ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. ప్రత్యేకమైన కార్యాచరణతో రైల్వేవ్యవస్థను మెరుగుపరిచారు. ఆధునిక వసతులు, వైఫై సదుపాయం కల్పిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రూ.31,221కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. ఎయిర్‌పోర్టుల నిర్మాణం విషయంలోనూ.. కేంద్రం చిత్తశుద్దితో పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా 2014కు ముందు వినియోగంలో ఉన్న 75 విమానాశ్రయాల సంఖ్యను.. ఈ 9 ఏండ్లలో 150 విమానాశ్రయాలకు పెంచినా.. తెలంగాణలో మాత్రం ఒక్క ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కాకపోవడం దురదృష్టకరం అని చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి... రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం కారణంగానే ఆ పనులు ఆలస్యమవుతున్నాయి అని ఆరోపించారు. ఎన్నికలు వస్తున్నాయని.. వరంగల్ విమానాశ్రయానికి భూసేకరణ చేస్తామని ఏదో ప్రకటన చేసినప్పటికీ.. ఇది కంటితుడుపు చర్య మాత్రమే అవుతుందన్నారు.

Trending News