హైదరాబాద్: ఎలాంటి షరతులు పెట్టకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే టిఎస్ఆర్టీసీ సమ్మెను విరమించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కార్మికులు కోరుతున్నందున.. వారు కోరినట్టుగానే ఎలాంటి షరతులు విధించకుండా విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్కు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. కార్మికుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని.. కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యే క్రమంలో వారికి కుటుంబ పెద్దగా సీఎం కేసీఆర్ భరోసా ఇస్తారని ఆశిస్తున్నట్టు పవన్ తెలిపారు. ఎలాంటి షరతులు పెట్టకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమణకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ ఈ విజ్ఞప్తి చేశారు.
పెద్దలు, గౌ. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి,
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించినందున వారి వినతిని మన్నించి కార్మికులపై సానుభూతితో ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని KCR గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.
— Pawan Kalyan (@PawanKalyan) November 20, 2019
Read also : అలా అయితే, సమ్మె విరమించడానికి సిద్దంగా ఉన్నాం: టిఎస్ఆర్టీసీ జేఏసి
ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా జనసేన ప్రతినిధుల ద్వారా కార్మిక సంఘాల నాయకులు తనను కోరారని పవన్ గుర్తుచేశారు.