కరీంనగర్: బుధవారం జరిగిన ఎస్ఎస్సీ సప్లిమెంటరీ హిందీ పరీక్షకు హుజురాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎగ్జామ్ సెంటర్‌లో ఒకే ఒక విద్యార్ధి హాజరయ్యాడు. ఉదయం 9.30 గంటల నుండి 12.15 వరకు జరిగిన హిందీ పరీక్షకు ఈ సెంటర్‌లో మొత్తం ఏడుగురు విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. ప్రణయ్ అనే విద్యార్ధి మాత్రమే హాజరయి ఎగ్జామ్ రాశాడు.
అయితే ఒక్కడి కోసం ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్‌మెంటల్ అధికారి, క్లర్క్, ఇన్విజిలేటర్, అటెండర్, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి(ఏఎన్‌ఎం), ఇద్దరు కానిస్టేబుళ్లు విధులు నిర్వహించారు. తనిఖీ కోసం రెండు ప్లయింగ్ స్క్వాడ్ బృందాలు రావడం గమనార్హం.
పదోతరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం(మే 4) నుంచి ప్రారంభం అయ్యాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 451 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1,03,528 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పర్యవేక్షణకు 72 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్‌లతో పాటు జిల్లాల వారీగా పరిశీలకులను నియమించారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్ష పూర్తయ్యే వరకు జిరాక్స్ కేంద్రాలు మూసి ఉండేలా కలెక్టర్లు, పోలీసుశాఖ వారు తగు చర్యలు చేపట్టారు. హాల్‌టిక్కెట్లు అందని విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ప్రధానోపాధ్యాయుని సంతకం చేయించి, స్టాంపు వేయించాలని అధికారులు సూచించారు.