రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా పెను దూమారం రేపిన ఓటుకు నోటు కేసు అంశంపై సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచంద్ర రావు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏకేఖాన్, అధికారులు, న్యాయవాదులు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ శాసనసభ నుంచి కౌన్సిల్ స్థానాల కోసం జరిగిన ఎన్నికల్లో ఇతర పార్టీలకు చెందిన నేతల ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నంలో భాగంగా తెలుగు దేశం పార్టీ ఓ నేతకు రూ.50 లక్షలు ఇవ్వచూపిందని అప్పట్లో తెలంగాణ ఏసీబీ ఓ కేసు నమోదు చేసింది. అప్పట్లో తెలుగు దేశం పార్టీలో వున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సదరు నేతతో సంభాషిస్తుండగా రికార్డ్ చేసిన ఆడియో టేపులు, విజువల్స్ సైతం వెలుగు చూడటంతో ఈ కేసు రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. తెలంగాణలో తెలుగు దేశం పార్టీని ఇరకాటంలో పడేసిన ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో వుంది.
ఇదిలావుంటే, వాయిస్ రికార్డుపై ఫోరెన్సిక్ విభాగం నివేదిక ఇవ్వగా, ఆ నివేదికలోని అంశాలని పరిశీలించేందుకే సీఎం కేసీఆర్ ఇవాళ ఈ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
ఓటుకు నోటు కేసు విచారణపై కేసీఆర్ ఆరా