Dharmapuri Arvind House Vandalised: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడికి పాల్పడిన కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లో తన నివాసంపై దాడికి పాల్పడి, తన తల్లి, ఇంట్లో పని చేసే సిబ్బందిని భయబ్రాంతులు గురిచేశారని ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు అక్కడి సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
ఈ కేసులో అరెస్ట్ అయిన 9 మంది నిందితుల తరపున న్యాయవాది తిరుపతి వర్మ బెయిల్ పిటిషన్ దాఖలు చేసి కోర్టు ఎదుట తన వాదనలు వినిపించారు. నిందితులకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా దాఖలైన పిటిషన్పై ఇరువురి వాదనలు విన్న కోర్టు.. తిరుపతి వర్మ వాదనలతో ఏకీభవిస్తూ 9 మందికి బెయిల్ మంజూరు చేసింది.
ఇదిలావుంటే, ఎంపి ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి ఘటన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. కుల అహంకారంతోనే కేసీఆర్ కుటుంబం ఈ దాడి చేయించిందని ధర్మపురి అర్వింద్ ఆరోపిస్తుండగా.. తెలంగాణ జాగృతి పేరుతో తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తోన్న ఒక మహిళ పట్ల అరవింద్ వ్యవహరించే తీరు ఇదేనా అని టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.
కేంద్రంలో పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయని చెప్పుకునే ధర్మపురి అర్వింద్ తన నిజామాబాద్ నియోజకవర్గం కోసం చేసిందేమీ లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతుదారులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇదిలావుంటే ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి ఘటనను కేంద్రం సైతం తీవ్రంగానే పరిగణించినట్టు వార్తలొస్తున్నాయి. దీంతో ఈ మొత్తం ఎపిసోడ్ ఎప్పుడు, ఎలాంటి టర్న్ తీసుకుంటుందా అనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది.