Nagole Gold Theft Case: నాగోలులో కాల్పులు, బంగారం చోరీ ఘటనలో ఇద్దరికి గాయాలు

Nagole Gold Theft Case: నిందితులు బైక్‌పై వచ్చి పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పక్కా పథకం ప్రకారం చోరికి వచ్చి కాల్పులు జరిపినట్లు అక్కడ ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2022, 11:59 PM IST
  • బంగారం దుకాణంలోకి చొరబడిన దుండగులు
  • యజమాని, సిబ్బందిపై కాల్పులు జరిపిన నిందితులు
  • బంగారం చోరి చేసి పరారైన దొంగలు
Nagole Gold Theft Case: నాగోలులో కాల్పులు, బంగారం చోరీ ఘటనలో ఇద్దరికి గాయాలు

Nagole Gold Theft Case: ఎల్బీనగర్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ సమీపంలో ఉన్న స్నేహపురి కాలనీలో ఉన్న మహదేవ్ జ్యువెలరీ షాప్ లోకి చొరబడిన దుండగులు కాల్పులు జరిపి దుకాణంలో ఉన్న బంగారంతో  ఉడాయించారు. రాత్రి 9.30 సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుకాణం మూసివేసే సమయానికి షాపులోకి చొరబడిన ఇద్దరు దుండగులు లోపలి నుంచి శెట్టర్ మూసి వేసి షాప్ యజమాని కళ్యాణ్ చౌదరిపై ఒక రౌండ్ కాల్పులు జరిపారు. దుకాణంలో పని చేసే వ్యక్తి సుక్‌దేవ్‌పైనా రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. షాపులో తుపాకీ కాల్పుల శబ్ధం, బిగ్గరగా అరుపులు వినబడటంతో పక్కనే ఉన్న దుకాణాల వాళ్ళు వెళ్లి శెట్టర్ ఓపెన్ చేశారు. 

వేరే వాళ్లు షెట్టర్ ఓపెన్ చేసుకుని రావడం గమనించిన దుండగులు వెంటనే వారిని పక్కకు తోసుకుంటూ బంగారంతో పరారయ్యారు. దుండగుల కాల్పులలో గాయపడిన ఇద్దరిని నాగోల్‌లోని ఒక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కళ్యాణ్ చౌదరి శరీరంలో నుండి బుల్లెట్‌ని బయటకు తీశారు. సుక్ దేవ్ శరీరంలో ఉన్న ఒక బుల్లెట్ బయటకు తీయగ మరో బుల్లెట్ వీపు భాగం లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

నిందితులు బైక్‌పై వచ్చి పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పక్కా పథకం ప్రకారం చోరికి వచ్చి కాల్పులు జరిపినట్లు అక్కడ ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. ఎస్ఓటి, సీసీఎస్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

Trending News