ఇటీవలే ముంబయి సబర్బన్ రైల్వే స్టేషనులో ఓ చిత్రమైన ఘటన జరిగింది. ప్రేమలత భన్సాలీ అనే ఆమె టికెట్ తీసుకోకుండా గాభరాగా ట్రైన్ ఎక్కేశారు. అయితే మహాలక్ష్మి రైల్వేస్టేషనులో దిగినప్పుడు మాత్రం ఆమె టికెట్ కలెక్టరుకు దొరికిపోయారు. టికెట్ లేనందుకు రూ.260 జరిమానాగా చెల్లించమని టీసీ అడిగితే ఆమె ఒక్కటే మాట అన్నారు.
"ముందు బ్యాంకులకు రూ.9 వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్న విజయ్ మాల్యాను అరెస్టు చేసి.. భారతదేశానికి తీసుకొచ్చి డబ్బు కక్కించండి. అప్పుడు నన్ను అడగండి.. ఫైన్ కడతాను. ఈ దేశంలో అందరూ సమానమే కదా.. మరి ధనికులను ఒకలా.. పేదవారిని ఒకలా చూస్తారా" అన్నారు. ఊహించని ఆమె రిప్లైకి విస్తుపోవడం రైల్వే అధికారుల వంతైంది. తాను ఫైన్ కట్టే ప్రసక్తి లేదని.. కావాలంటే జైలుకి తీసుకెళ్లండి అని భీష్మించుకు కూర్చున్నారు ప్రేమలత.
ఆఖరికి ఆమెకు శతవిధాలా చెప్పినా ఒప్పుకోకపోవడంతో ఆమె భర్తకు కబురు పెట్టారు అధికారులు. ఆయన వల్ల కూడా పరిస్థితి సద్దుమనగపోవడంతో ఇక చేసేదేమీ లేక జిల్లా మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. అక్కడ కూడా తాను ఫైన్ కట్టాలంటే మాల్యాను భారత్ తీసుకువచ్చి జైల్లో పెట్టాలనే చెప్పారు. లేకపోతే.. తననైనా జైలుకి పంపండి అని కోరారు. ప్రేమలత వార్త సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అయ్యింది