హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై దాడికి పాల్పడ్డ కేసులో అరెస్టయిన మహమ్మద్ పహిల్వాన్(60) మృతి చెందాడు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న పహిల్వాన్ గుండెపోటు రావడంతో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. గుండెపోటు రావడంతో మలక్ పేట యశోద ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహమ్మద్ పహిల్వాన్ కన్నుమూశాడు. ఆయనకు సంతానం ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు.
8 ఏళ్ల కిందట అక్బరుద్దీన్‌పై జరిగిన దాడి, కాల్పులు జరిపిన కేసు సహా పహిల్వాన్‌పై పలు కేసులు ఉన్నాయి. బండ్లగూడ, షహీన్ నగర్, బర్కాస్ ఏరియాల్లో భూఆక్రమణ కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నాడు. అక్బరుద్దీన్‌పై దాడి కేసులో అరెస్టయిన పహిల్వాన్ ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. జైల్లో ఉన్న సమయంలో బెయిల్ రాకపోవడంతో సుప్రీంకోర్టు మెట్లెక్కాడు పహిల్వాన్.
కాగా, పహిల్వాన్ తుపాకీతో కాల్పులు జరిపిన దాడిలో అక్బరుద్దీన్ ఒవైసీ శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లి తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు చనిపోయే పరిస్థితి అప్పట్లో తలెత్తింది. దాదాపు మూడేళ్ల చికిత్స తర్వాత కోలుకున్నా.. ఇప్పటికీ అక్బరుద్దీన్ శరీరంలో ఓ బుల్లెట్ ఉండిపోయింది. బుల్లెట్ బయటకు తీస్తే నడవటం కష్టమేనని గతంలో వైద్యులు సూచించినట్లు సమాచారం.