Minister KTR: మోదీ సర్కార్ చేతిలో ఈడీ కీలు బొమ్మ.. సీబీఐ తోలు బొమ్మ: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Minister KTR Reacts On ED Notice to MLC Katitha: మోదీ సర్కార్ చేతిలో ఈడీ కీలు బొమ్మ.. సీబీఐ తోలు బొమ్మ అంటూ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది ఈడీ కాదని.. మోడీ సమన్లుగా భావించాలని అన్నారు. దేశాన్ని ప్రధాని మోడీ భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2023, 03:48 PM IST
Minister KTR: మోదీ సర్కార్ చేతిలో ఈడీ కీలు బొమ్మ.. సీబీఐ తోలు బొమ్మ: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Minister KTR Reacts On ED Notice to MLC Katitha: బీజేపీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ పార్టీ నేతలపై దర్యాప్తు సంస్థలతో మోదీ సర్కార్ దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. మంత్రి గంగుల కమలాకర్ మంత్రి మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్ ఇంటి మీద ఐటీ, ఈడీ అధికారులతో దాడులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా  మంత్రి జగదీశ్ రెడ్డి మీద ఐటీ ఐటీ దాడులు జరిగాయన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్  పార్టీ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్థసారధి రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మీద ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 12 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించిందన్నారు. 

'ఇదే క్రమంలో నిన్న ఎమ్మెల్సీ కవిత గారికి ఈడీ పంపించింది. ఇక్కడ దేశ ప్రజలు గమనించాల్సిందేమిటంటే ఇది ఈడీ సమన్లు కాదు మోడీ సమన్లుగా భావించాలి. మోడీ సర్కార్ చేతిలో ఈడీ కీలుబొమ్మ.. సీబీఐ తోలుబొమ్మగా మారాయి. మోడీ ప్రభుత్వానికి తెలిసింది ఒకటే.. అయితే జూమ్లా లేదంటే హమ్లా. నీతిలేని పాలనకు.. నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు పర్యాయపదంగా మారింది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం. ప్రతిపక్షాల మీద కేసుల దాడి, ప్రజల మీద ధరల దాడి.. ఇది తప్ప ఈ తొమ్మిదేళ్లలో మోడీ సర్కార్ సాధించింది ఏమీ లేదు. గౌతమ్ ఆదానీ అనే వ్యక్తి ఎవరి బీనామో దేశంలోనే చిన్న పిల్లగాడిని సైతం అడిగిన చెబుతాడు. ఆయన మోడీ గారి బినామీ దేశ ప్రజలకు తెలియంది కాదు.

దేశాన్ని కుదుపు కుదిపేసిన  హిండెన్ బర్గ్ నివేదిక.. 13 లక్షల కోట్ల ఎల్ఐసీ, ఎస్‌బీఐ వంటి  ప్రజలకు చెందిన సంస్థల డబ్బులు ఆవిరైనా .. ఈ దేశ ప్రధానమంత్రి ఉలకడు పలకడు. దేశ ఆర్థిక మంత్రికి కనీసం చీమకుట్టినట్టు కూడా కాదు. ఒక సంస్థకు రెండు ఎయిర్ పోర్టులకంటే ఎక్కువ కాంట్రాక్టు కట్టబెట్టొద్దు అని ఇప్పటిదాకా ఉన్న నిబంధనలను తుంగలో తొక్కి.. గౌతమ్ అదానీకి ఆరు ఎయిర్ పోర్టులు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం..? ఇది తప్పు అని సాక్షాత్తు నీతి ఆయోగ్ తన నివేదికలో తెలిపింది. 

ఒక వ్యక్తికి అనుకూలంగా నిబంధనలను మార్చి ఆయనకు ఆర్థిక లబ్ది చేకూరేలా.. వ్యవహరిస్తూ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నది మోడీ ప్రభుత్వం. అదానీ ఆధీనంలోని గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో 3000 కిలోల అంటే దాదాపు 21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడితే ఒక్క కేసు నమోదు కాలేదు. మోడీ పాలనలో ఈడీ దాడులు 95 శాతం విపక్షాల మీదనే జరుగుతున్నాయి. ఈ తొమ్మిదేళ్లలో ప్రతిపక్షాల మీద పెట్టిన ఈడీ నమోదు చేసిన కేసుల సంఖ్య 5422. అందులో కేవలం 23 కేసుల్లో మాత్రమే తీర్పు వచ్చింది. ఈ లెక్కన దర్యాప్తు ఈడీ వంటి సంస్థలతో దాడులు చేయించి మోడీ సర్కార్ ఏం చేస్తుందో దేశ ప్రజలు గమనిస్తున్నారు..' అని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఇటీవల కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్ష కొడుకు రూ.40 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డా.. ఎలాంటి దాడులు ఉండవన్నారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ పాటిల్ అనే వ్యక్తి.. తాను బీజేపీలో చేరాను కాబట్టి తన మీదకు ఈడీ రాదని చెప్పిన విషయం టీవీల్లో సైతం ప్రసారం అయిందని గుర్తుచేశారు. తొమ్మిది రాష్ట్రాల్లో దొడ్డిదారిన మోడీ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చింది నిజం కాదా..? అని ప్రశ్నించారు.

Also Read: Naveen Murder Case: నవీన్ హత్య కేసులో వారిద్దరు ఎక్కడ..? పోలీసులు ముమ్మరంగా గాలింపు

 Also Read: MCLR Rate: హోలీ పండుగ వేళ షాక్.. ఈ బ్యాంక్ వడ్డీ రేట్లు మళ్లీ పెరిగాయి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.TwitterFacebook 

Trending News