మహాకూటమి రహస్య మంతనాలు ; సీట్ల సర్దుబాటుపై క్లారిటీ

                           

Last Updated : Oct 13, 2018, 04:20 PM IST
మహాకూటమి రహస్య మంతనాలు ; సీట్ల సర్దుబాటుపై క్లారిటీ

హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్ష పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయం ముంచుకొస్తున్నప్పటికీ కూటమిలో సీట్ల సర్దుబాటు పంచాయితీ తేలడం లేదు.. మొత్తం 119 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 90 స్థానాలకంటే తక్కువ కాకుండా పోటీ చేయాలని భావిస్తుంటే  మిగత పార్టీలన్నీ కలిపి దాదాపు 50 సీట్లు ఆశిస్తున్నాయి. దీనిపై ఎవరూ పట్టువీడటం లేదు....అన్ని పార్టీలు కూడా తమ తమ బలాన్ని ప్రదర్శిస్తూ ఎక్కువ సీట్లు ఆశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని పరిష్కరించేందుకు మహాకూటమికి చెందిన కీలక నేతలు మీడియాకు దూరంగా రహస్య మంతనాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సమాచారం లీకైతే అనేక ప్రాంతాల్లో ఆందోళనలు చోటు చేసుకునే ప్రమాదమున్నందున ఈ మేరకు  నేతలు రహస్య ప్రదేశంలో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. 

ప్రముఖ మీడియా కథనం ప్రకారం సీట్ల సర్దుబాటు విషయంలో కొదండరాంకు చెందిన టీజేఎస్ పార్టీ 16 సీట్లు కావాలని పట్టుబడుతుంటే 9 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధపడింది. అలాగే టీడీపీ 15 సీట్లకు డిమాండ్ చేయగా.. 9 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధపడింది. సీపీఐ మాత్రం 3 స్థానాలతో సరిపెట్టుకున్నట్లు తెలిసింది. కాగా టీడీపీ, టీజేఎస్ ప్రతిపాదనలపై మరోసారి చర్చించి తమ నిర్ణయాన్ని చెబుతామని కాంగ్రెస్ చెప్పినట్లు టాక్. ఈ సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో టీడీపీ,టీజేఎస్ ల ప్రతిపాదనలపై చర్చించి తమ నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం వరకు మహాకూటమి సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి రావచ్చని రాజకీయవర్గాలు చెప్పుకుంటున్నాయి. తాజా పరిణామంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

Trending News