టీఆర్‌ఎస్ కార్పొరేటర్లకు కేటీఆర్ క్లాస్

  

Last Updated : Oct 29, 2017, 08:29 PM IST
టీఆర్‌ఎస్ కార్పొరేటర్లకు కేటీఆర్ క్లాస్

టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లలో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో భాగంగా నగర టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల తో  బేగంపేటలోని హరిత ప్లాజాలో సమావేశమయ్యారు. నగరాభివృద్ధిలో మరింత చురుకైన భాగస్వామ్యం తీసుకోవాల్సిందిగా కార్పోరేటర్లకు మంత్రి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్ నగర అభివృద్ధిపైన ప్రత్యేకమైన విజన్ ఉందని, ఈ దిశగా జిహెచ్ఎంసిని బలోపేతం చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగర పరిధిలో ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలను మంత్రి కార్పోరేటర్లకు సుదీర్ఘంగా వివరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు తమ డివిజన్ల వారీగా తెలిపిన సమస్యలను విన్న మంత్రి, వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు అదేశాలు జారీ చేశారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కాకుండా కార్పొరేటర్ల కోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 

ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు అందరం కలిసి నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ముందుండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జిహెచ్ఎంసి నుంచి ప్రజలు అద్భుతాలేమి, ఆశించడం లేదని వారి యొక్క కనీస అవసరాలను తీర్చితే సరిపోతుందన్న మంత్రి, ఆ దిశగా పనిచేద్దామన్నారు. వాటర్ సప్లై, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం, పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అంశాలపైనే ప్రధానంగా తమ దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. కార్పోరేటర్లుగా ఎన్నికై ఇప్పటికే సంవత్సరన్నర దాటిందన్న మంత్రి, ఇకపై నిరంతరం ప్రజల్లో తిరగాలని కోరారు. ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు వారి వేంట ఉంటే సరిపోతుందని, ప్రజల కష్టసుఖాలను పంచుకోవాలని కోరారు. ప్రజల అవసరాలను తీర్చేలా జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పనిచేయాలన్నారు. 

సర్కిళ్ల స్థాయిలో నిర్వహిస్తున్న ఉమ్మడి సమన్వయ సమావేశంలో ఇకపై కార్పోరేటర్లను కూడా భాగస్వాములను చేసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేటర్లు ప్రస్తావించే సమస్యలపట్ల సాధ్యమైనంతవరకు సానుకూలంగా స్పందించాలని అధికారులను కోరారు. తమ డివిజన్లను అభివృద్ధి చేసుకునేందుకు కార్పోరేటర్లకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. తమ డివిజన్ లేదా వార్డులను అదర్శంగా తీర్చిదిద్దితే ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. పార్కులు, ఇతర ప్రభుత్వ స్థలాల కబ్జాలను అరికట్టి, రెవెన్యూ అధికారుల సహాకారంతో కాపాడాలన్నారు. మరోపైపు ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా నడుచుకోవాలని కార్పొరేటర్లకు ఈ సందర్భంగా తెలిపారు. తమతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన కార్పొరేటర్లు, తమ డివిజన్లలో కావాల్సిన పనుల వివరాలను మంత్రికి అందించారు. కార్పోరేటర్లు అందించిన సమస్యలపైన వేంటనే చర్యలు తీసుకోవాలని హాజరైన వివిధ శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు.

Trending News