Konda Surekha: మళ్లీ రెచ్చిపోయిన కొండా సురేఖ.. పోలీస్ స్టేషన్‌లో రచ్చరచ్చ

Konda Surekha Nuisance In Police Station: కొండా సురేఖ మళ్లీ రెచ్చిపోయారు. పోలీస్‌ స్టేషన్‌లో సీఐ కుర్చీలో కూర్చొని రచ్చరచ్చ చేశారు. తన అనుచరుల కోసం ఆమె పోలీసులపైనే దురుసుగా ప్రవర్తించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 13, 2024, 07:41 PM IST
Konda Surekha: మళ్లీ రెచ్చిపోయిన కొండా సురేఖ.. పోలీస్ స్టేషన్‌లో రచ్చరచ్చ

Konda Surekha vs Revuri Prakash Reddy: నోటి దురుసుతో రాజకీయంగా.. సినిమాపరంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మంత్రి కొండా సురేఖ మరోసారి రెచ్చిపోయారు. అయితే ఈసారి నోటితో కాకుండా తన వ్యవహార శైలితో రచ్చరచ్చ చేశారు. పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని నానా హంగామా సృష్టించారు. సీఐ కుర్చీలో కూర్చుని అరెస్ట్‌ చేసిన తన అనుచరులను విడిపించాలని కోరుతూ హల్‌చల్‌ చేశారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి దసరా ఉత్సవాల్లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ కారణమైంది. స్థానిక ఎమ్మెల్యే ఫొటో వేయకుండా మంత్రి అనుచరులు వివాదం రేపడంతో తీవ్ర కలకలం ఏర్పడింది. ఫలితంగా గీసుకొండలో పరిస్థితులు అదుపు తప్పాయి. మంత్రి వ్యవహార శైలిలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Also Read: KT Rama Rao: దసరా రోజు ఆ ఇద్దరి మరణానికి రేవంత్‌ రెడ్డిదే బాధ్యత

ఏం జరిగింది?
దసరా ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా ధర్మారంలో మంత్రి కొండా సురేఖ అనుచరులు ఫ్లెక్సీలు వేయించారు. అయితే ఆ నియోజకవర్గం పరకాల కిందకు వస్తుంది. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఫొటో ఫ్లెక్సీలలో వేయలేదు. ఇది గమనించిన ఎమ్మెల్యే అనుచరులు, మద్దతుదారులు కొండా సురేఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖ అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కొండా సురేఖ అనుచరులు ఎమ్మెల్యే వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. దీనిపై గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. అయితే తన అనుచరులను అరెస్ట్‌ చేయడంతో కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: KCR Family: దసరా సంబరాల్లో కేసీఆర్‌.. మనవడితో వీడియో కాల్‌ వైరల్‌

సమాచారం అందుకున్న వెంటనే గీసుకొండ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని నానా హంగామా చేశారు. ఏకంగా సీఐ చాంబర్‌లోకి వెళ్లి రచ్చ చేశారు. సీఐ కుర్చీలో కూర్చొని పోలీసులకు ఆమె క్లాస్‌ పీకారు. తన అనుచరులను అరెస్ట్‌ చేసింది ఎవరు? ఎంత ధైర్యం అనే రీతిలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని నిమిషాల పాటు ఠాణాలో ఉండి హల్‌చల్‌ చేశారు. ఆమె స్టేషన్‌కు వచ్చారని తెలుసుకుని ఆమె అనుచరులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. 

పోలీస్‌ స్టేషన్‌ రణరంగాన్ని తలపించడంతో వెంటనే వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఒక సీఐ కుర్చీలో మంత్రి చేసిన చేసిన హంగామాను పోలీస్‌ అధికారులు తప్పుబట్టారు. మంత్రికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు. అయితే అనుచరులను కూడా విడిచిపెట్టినట్లు సమాచారం. ఈ వివాదంతో మరోసారి కొండా సురేఖ వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి అయినంత మాత్రాన సీఐ కుర్చీలో కూర్చొని బెదిరింపులకు పాల్పడడం ఏమిటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

పచ్చ గడ్డి వేస్తే భగ్గు
కొన్నాళ్లుగా కొండా సురేఖ, రేవూరి ప్రకాశ్‌ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు ఉన్నాయి. ఇద్దరు ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అయినా కూడా వారి మధ్య వర్గ పోరు నడుస్తోంది. ఆమె గతంలో పరకాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి తన భర్త కొండా మురళీకి పరకాల స్థానం ఆశించగా టికెట్‌ లభించకపోయింది. రేవూరి ప్రకాశ్‌ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అయితే పరకాల నియోజకవర్గంపై కన్నేసిన కొండా సురేఖ ఇక్కడ తన ఆధిపత్యం చలాయించాలని చూస్తోంది. నామినేటెడ్‌ పోస్టుల సమయంలోనూ సురేఖ, ప్రకాశ్‌ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఫోన్‌లోనే వీరిద్దరూ దూషించుకున్నారు. ఇప్పుడు దసరా ఉత్సవాలు వారి మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఈ వ్యవహారం కాంగ్రెస్‌ పార్టీకి చేటు చేసేలా ఉంది. ఇప్పటికే సమంత వ్యవహారంలో సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా.. ఇప్పుడు పోలీస్‌ స్టేషన్‌ వ్యవహారం మరింత విమర్శలకు దారి తీస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News