సీఎం కేసీఆర్‌పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్‌పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Last Updated : Sep 14, 2019, 12:42 AM IST
సీఎం కేసీఆర్‌పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

నల్గొండ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ నేత, యాదాద్రి-భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ రైతులను మోసం చేసి ఎన్నికల్లో గెలిచారని... రైతులను మోసం చేసిన ఆయనకు తప్పకుండా వారి ఉసురు తగులుతుందని కోమటిరెడ్డి శాపనార్థాలు పెట్టారు. ప్రాజెక్టులు నిర్మించి రైతులకు మేలు చేస్తామని చెప్పిన కేసీఆర్ అదే ప్రాజెక్టుల పేరుతో 3 లక్షల కోట్లు అప్పు చేశారని ఎంపి కోమటిరెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరును ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సైతం వ్యతిరేకిస్తున్నారని.. అందుకే ఆ పార్టీలో ముసలం పుట్టిందని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. నాయిని నర్సింహా రెడ్డి లాంటి అగ్ర నేతకే మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతోందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. అంతేకాకుండా అధినేత కేసీఆర్ తీరును వ్యతిరేకిస్తున్న పార్టీ నేతలను తెలంగాణ భవన్‌కు పిలిచి కాళ్లు పట్టుకుని మరీ పార్టీలోనే కొనసాగేలా చేస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.

నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలపై ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి స్పందిస్తూ... ప్రాణాలు అర్పించైనా యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని అన్నారు.

Trending News